Godavarikhani Government Hospital: కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!

27 Dec, 2021 02:27 IST|Sakshi
ఆస్పత్రి వద్ద నిరసన తెలుపుతున్న బంధువులు, నాయకులు 

ప్రసూతి వార్డులో బాలింత ఆత్మహత్య 

బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుని బలవన్మరణం 

గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన 

పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చిన తల్లి.. ఇటీవలే మగబిడ్డకు జన్మ 

కోల్‌సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది.

ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. 

నొప్పితో తల్లడిల్లి.. 
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్‌ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్‌చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు.


ఉమ (ఫైల్‌) 

సిజేరియన్‌ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్‌ఫెక్షన్‌ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు.  

వేకువజామున ఉరేసుకొని.. 
బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్‌పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సకాలంలో ఆక్సిజన్‌ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్‌ఫెక్షన్‌ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. 

డీసీహెచ్‌ఎస్‌ విచారణ  
ఉమ మృతిపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్‌ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్‌తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీసీహెచ్‌ఎస్‌ తెలిపారు.  

వైద్యుల నిర్లక్ష్యం లేదు 
వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్‌ఎస్‌ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది.  
– డాక్టర్‌ భీష్మ, ఆర్‌ఎంవో 

నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు 
రెండుసార్లు కుట్లేసినా ఇన్‌ఫెక్షన్‌ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్‌ రూంలో డ్రెస్సింగ్‌ చేసి నరకం చూపించారు. లేబర్‌ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్‌కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే  ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.  
– రాజేశ్వరి, మృతురాలి తల్లి 

మరిన్ని వార్తలు