చిత్తూరులో మాయం.. గుంటూరులో ప్రత్యక్షం

20 Mar, 2022 04:28 IST|Sakshi
పోలీసులు రక్షించిన పసికందు

ఆస్పత్రిలో శిశువును దొంగిలించి రూ.50 వేలకు విక్రయం

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

సెల్‌ఫోన్‌ ఆధారంగా గుంటూరు బస్టాండ్‌లో నిందితుల పట్టివేత

శిశువును గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు 

చిత్తూరు అర్బన్‌/ చిత్తూరు రూరల్‌/ గుంటూరు రూరల్‌ : శనివారం తెల్లవారుజామున చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందును అదే రోజు రాత్రి గుంటూరు ఆర్టీసీ బస్టాండులో పోలీసులు క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరులోని మంగసముద్రంకాలనీలో నివాసముంటున్న రషీద్‌ భార్య బి.షబానా ఈ నెల 14న ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం వరకు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.

ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బిడ్డకు పాలిస్తూ నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే పక్కన బిడ్డ కనిపించక పోవడంతో ఆందోళన చెందుతూ సమీపంలో పడుకున్న తల్లి, తోడికోడలిని నిద్ర లేపింది. వారు వెంటనే ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు విషయం చెప్పారు. కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు అనుమానిత మహిళలు 5.17 గంటల సమయంలో బిడ్డను ఎత్తుకు వెళుతున్నట్లు కెమెరాల్లో రికార్డయ్యింది.

ఈ విషయాన్ని పోలీసులు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు చేరవేశారు. ఆయన చిత్తూరు టూటౌన్‌ సీఐ యుగంధర్‌ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల్లో కనిపించిన మహిళల్లో ఒకరు చిత్తూరులోని సంతపేటకు చెందిన పవిత్రగా గుర్తించారు. ఈమెను అదుపులోకి తీసుకుని విచారించారు. వైజాగ్‌లోని భీమిలికి చెందిన పద్మ అనే మహిళ ఇటీవల తనకు పరిచయమైందని, తనకు మగబిడ్డ కావాలని కోరుతూ రూ.50 వేలు ఇచ్చిందని చెప్పింది. దీంతో ఆస్పత్రిలో బిడ్డను దొంగిలించి, ఆమెకు విక్రయించానని తెలిపింది.

సెల్‌ఫోన్‌ ఆధారంగా కూపీ..
బిడ్డను వైజాగ్‌ తీసుకెళుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పద్మ సెల్‌ఫోన్‌ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుంటూరు పోలీసులను చిత్తూరు పోలీసులు అప్రమత్తం చేశారు. గుంటూరు బస్టాండులోని ఓ బస్సులో పసికందుకు కొత్త బట్టలు వేసి ఉండటం గమనించిన పోలీసులు.. ఆ బిడ్డను ఎత్తుకున్న మహిళను ప్రశ్నించారు. తొలుత వారు తమ బిడ్డ అని వాదించారు. ఆమె పేరు పద్మ అని తెలియడంతో ఆమెను, ఆమె భర్త వెంకటేశ్వర్లును చేబ్రోలు సీఐ పి.సుబ్బారావు, నల్లపాడు ఎస్‌ఐ కిషోర్‌లు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు.

కిడ్నాపైన పసిబిడ్డను క్షేమంగా స్వాధీనం చేసుకుని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో పవిత్రతో పాటు మరో మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే బిడ్డను పోలీసులు క్షేమంగా రక్షించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల విశాఖ ప్రభుత్వాస్పత్రిలో ఇదే రీతిలో కిడ్నాప్‌కు గురైన మరో చిన్నారిని సైతం పోలీసులు రక్షించడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు