‘బ్యాండ్‌ బజా బరాత్’‌.. ఒక్కరికి రూ.12 లక్షలు

5 Dec, 2020 14:50 IST|Sakshi
సీసీకెమరాకు చిక్కిన బ్యాండ్‌ బజా బరాత్‌ గ్యాంగ్‌ సభ్యుడు

సాక్షి, న్యూఢిల్లీ: భూములను లీజుకు తీసుకోవడం.. షాపులు లీజుకు తీసుకోవడం చూశాం.. కానీ పిల్లల్ని లీజుకు తీసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా. కానీ ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌ పిల్లలను లీజకు తీసుకుని.. పెళ్లిల్లలో దొంగతనం ఎలా చేయాలో వారికి శిక్షణ ఇస్తున్నారు. పిల్లల్ని లీజుకు ఇచ్చినందుకు గాను ఒక్కొక్క పిల్లవాడి తల్లిదండ్రులకు వారు ఏకంగా 10-12లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం ఓ భారీ వివాహానికి హాజరయ్యి.. చేతివాటం చూపి నగదుతో ఉడాయిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఇక వీరిని విచారించగా సంచలన విషయాలు తెలిసాయి.

గత కొద్ది నెలలుగా నగరంలో పలు ఫంక్షన్‌హాల్స్‌లో భారీగా నగలు, డబ్బు మాయమవుతుంది. అతిథిలు పెళ్లి హాడావుడిలో ఉండగా.. దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు.  రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్‌ హాల్స్‌ వివరాలు సేకరించి.. అక్కడికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీటీవీ కెమరా రికార్డులను పరిశీలించారు. ఇక కొన్ని ఫంక్షన్‌ హాల్స్‌ దగ్గర ఇన్‌ఫార్మర్లను ఉంచారు. అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. (చదవండి: సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...)

ఈ క్రమంలో ఈ నెల 2న ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఇదే తరహా దొంగతనం చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఏడుగురు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నిందితులు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌ వెళ్లే ప్రయత్నంలో ఉండగా వారిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇక వీరిని విచారించగా..  సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు.. న్యూఢిల్లీ సమీప ప్రాంతంలోని గుల్ఖేరీ గ్రామానికి చెందిన పేద పిల్లల్ని ఈ గ్యాంగ్‌ తమ పని కోసం  ఎన్నుకుంటుంది.

ఇందుకు ఒక్కొ పిల్లవాడి తల్లిదండ్రులకి 10-12 లక్షల రూపాయల చొప్పున చెల్లించి తమతో పాటు ఢిల్లీకి తీసుకువస్తారు. ఆ తర్వాత వారికి ఓ నెల రోజుల పాటు పెళ్లిల్లలో దొంగతనాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. దానిలో భాగంగా మంచి దుస్తులు ధరించడం.. అతిథులతో కలిసి పోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా దొంగతనం చేసి పట్టుబడినప్పుడు మిగతా వారి గురించి సమాచారం ఇవ్వకుండా ఉండటం వంటి విషయాలకు సంబంధించి శిక్షణ ఇ‍స్తారు. ఆ తర్వాత పిల్లలను పెద్దవారితో కలిపి బిగ్‌షాట్స్‌ పెళ్లిల్లకు పంపిస్తారు​. (చదవండి: పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ)

అయితే ఈ గ్యాంగ్‌ వెళ్లగానే దొంగతనాలకు పాల్పడదు. ముందుగా అతిథులతో కలిసిపోతారు. వారితో మంచిగా మాట్లాడి నమ్మకం సంపాదిస్తారు. డిన్నర్‌ చేశాక గెస్ట్‌లందరు ఇళ్లకు తిరిగి వెళ్లే హడావుడిలో ఉండగా.. అప్పుడు తమ చేతులకు పని చేప్తారు. అప్పటికే వచ్చిన అతిథుల్లో ఎవరు బంగారం, డబ్బు వంటి విలువైన బహుమతలు ఇస్తున్నారో తెలుసుకుని.. వాటితో పాటు వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తారు. గ్యాంగ్‌ సభ్యులందరు ఒక్క చోటకు చేరాక.. వచ్చిన నగదును పంచుకుని తర్వాత ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోతారు. ఇలా సదరు గ్యాంగ్‌ సొంతూరికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు. మిగతా గ్యాంగ్‌ మెంబర్స్‌ కోసం వెతుకుతున్నారు.

మరిన్ని వార్తలు