మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు

8 Oct, 2020 04:14 IST|Sakshi
దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా కళాశాల

మరో 15 మందిపై కూడా

డిగ్రీ కళాశాల స్థల వివాదమే కారణం

ప్రొద్దుటూరు/హైదరాబాద్‌: ఒక డిగ్రీ కళాశాల స్థల వివాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి, అల్లుడు రామచంద్రారెడ్డితోపాటు మరో 15 మందిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో మహిళల విద్య కోసం 1977లో స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయానికి చెందిన 18.18 ఎకరాల భూమిని దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించారు. నిబంధనల ప్రకారం.. ఈ భూమిని అమ్మకూడదు. అయితే కళాశాల నిర్వాహకులు ఇందులోని 11 ఎకరాలను అమ్మేందుకు మాజీ ముఖ్యమంత్రి సోదరుడొకరు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా 2012 మార్చి 30న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఇందులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం ఎకరా రూ.15 కోట్లకుపైగా ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల స్థలం మిట్టా శివ గణేశ్‌కు ఉంది. ఇది వివాదంలో ఉండటంతో ఆయన ఇటీవల రామచంద్రారెడ్డిని సంప్రదించాడు. వివాదాన్ని పరిష్కరిస్తే ఎకరం స్థలాన్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే మొత్తం రెండున్నర ఎకరాలు తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని కొండారెడ్డి, రామచంద్రారెడ్డితోపాటు వారి గన్‌మెన్లు, అనుచరులు హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్న మిట్టా శివగణేశ్‌పై మంగళవారం దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ మేరకు శివగణేశ్‌ వారిపై ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ కళాశాల స్థలం అమ్మకంపై స్థానికులు కూడా కోర్టులో కేసు వేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు