Radisson Blu Pub Raids: తెచ్చిందెవరు.. వాడిందెవరు? 

5 Apr, 2022 03:42 IST|Sakshi
అభిషేక్, అనిల్‌లను కోర్టుకు  తరలిస్తున్న పోలీసులు 

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం 

ప్రాథమికంగా నిందితుల జాబితాలో నలుగురు 

మేనేజర్‌ అనిల్‌కుమార్‌ కీలకమంటున్న పోలీసులు 

ఫోరెన్సిక్‌ ఆధారాలపైనా దృష్టి.. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రాడిసన్‌బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సూత్రధారులతోపాటు మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు పలు కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆదివారం అరెస్టయిన మహాదారం అనిల్‌కుమార్, ఉప్పాల అభిషేక్‌లను సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వీరమాచినేని అర్జున్, పి.కిరణ్‌రాజులను కూడా  నిందితులుగా చేర్చారు. పబ్‌ మేనేజర్‌గా ఉన్న అనిల్‌కుమార్‌ ఈ కేసులో కీలకమని.. అతడితోపాటు అభిషేక్‌ను వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసులు: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి.. డ్రగ్స్, రేవ్‌ పార్టీ గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా బిగ్‌బాస్‌ విన్నర్, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు సిద్ధార్థ్‌తోపాటు పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా రు. పోలీసులు వారందరి వివరాలు నమోదు చేసు కుని పంపేశారు.

ఈ వ్యవహారంపై ఎన్డీపీఎస్‌ చట్టంలోని 8సీ, 22 బీ, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు దొరికిన ప్రాంగణం యజమానులు నిందితులుగా మారతారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పబ్‌ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్‌లను నిందితులుగా చేర్చారు. పబ్‌లోని బార్‌ కౌంటర్‌పై స్ట్రాలు పెట్టే క్యాడీ (ప్లాస్టిక్‌ డబ్బా) నుంచి 5 కొకైన్‌ పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు.

వాటిలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ బార్‌ కౌంటర్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ ఆధీనంలో ఉండటంతో అతడు నిందితుడిగా మారాడు. వీరిలో అభిషేక్, అనిల్‌ లను అరెస్టు చేయగా.. అర్జున్, కిరణ్‌రాజ్‌ ఇద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పబ్‌ యజమా నుల్లో ఒకరైన కిరణ్‌రాజ్‌ ఓ కేంద్ర మాజీ మంత్రి అల్లుడిగా తెలుస్తోంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. 

సీసీ కెమెరాల్లో దొరకలే.. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సోమవారం విశ్లేషించారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పబ్‌లో ఓ పక్కగా బార్‌ కౌంటర్‌ ఉంది. పార్టీ జరిగే సమ యంలో అంతా కిక్కిరిసి, కౌంటర్‌కు అడ్డుగా ఉండటంతో.. అనిల్‌కుమార్‌ కదలికలు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. అతడి ఫోన్, ఐపాడ్‌లను విశ్లేషిస్తే.. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

ఇక పబ్‌లో డ్రగ్స్‌ వాడినవారిని గుర్తించడానికి అవసరమైన ప్రతి ఆధారాన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. పబ్‌లో ఆదివారం చేసిన దాడుల్లో క్లూస్‌టీం 216 సిగరెట్‌ బడ్స్‌ను సీజ్‌ చేసింది. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపడం ద్వారా ఎవరైనా డ్రగ్స్‌ వాడారా అనేది తేల్చాలని భావిస్తున్నారు. వాటిని వినియోగించిన వారి లాలాజలం సిగరెట్‌ పీకలకు అంటుకుని ఉం టుందని.. అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి టెస్టులు చేయిస్తే, ఎవరు కాల్చారనేది బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. దీనితోపాటు అనిల్‌కుమార్‌ను విచారించి డ్రగ్స్‌ వాడినవారి పేర్లను రాబట్టాలని.. వారి నుంచి రక్తం, తల వెంట్రుకల శాంపిల్స్‌ తీసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించాలని భావిస్తున్నారు. 

రాడిసన్‌ హోటల్‌ బార్‌ లైసెన్సు రద్దు 
రాడిసన్‌బ్లూ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌ఏ అజయ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 6లో ఉన్న ఈ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లోని పబ్‌లో డ్రగ్స్‌ పట్టుబడిన నేపథ్యంలో 2బి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత ఈ విషయంగా షోకాజ్‌ నోటీసు జారీ చేసిన అధికారులు.. కొద్దిగంటల్లోనే లైసెన్స్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు