నాకు కరోనా.. ఇంటి పత్రాలిస్తావా? ముఖంపై దగ్గమంటావా?

4 Jun, 2021 08:53 IST|Sakshi

సాక్షి ,బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ప్రపంచమంతా కోవిడ్‌ మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలి, వస్తే ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన పేరుమీదున్న ఇంటిపత్రాలను చేతికివ్వకపోతే కరోనాను అంటిస్తానంటూ భర్తపైనే బెదిరింపులకు దిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌కు చెందిన వి.సంజీవరెడ్డి(70) కొన్నేళ్ల క్రితం మొదటి భార్యతో విడిపోయి కోనేరు భారతి(40)ను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి 17 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ సమయంలోనే భారతి పేరుమీద ప్రశాసన్‌నగర్‌లో రూ.5 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని సంజీవరెడ్డి కొని అక్కడ కాపురం పెట్టారు. అయితే భారతి కొంతకాలంగా సంజీవరెడ్డిని విడిచి మరో వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోంది. దీంతో సంజీవరెడ్డి నందగిరిహిల్స్‌లో ఉన్న మరో ఇంటికి మారే క్రమంలో ఇంటి పత్రాలు కూడా తీసుకెళ్లిపోయాడు.

ఇంటి పత్రాలిస్తావా? అంటించమంటావా?
ఈ విషయమై కొద్దికాలంగా సంజీవరెడ్డి, భారతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 31న సంజీవరెడ్డి ఇంటికొచ్చిన భారతి..‘‘తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, తన పేరుతో ఉన్న ఇంటికి సంబంధించిన పత్రాలు ఇస్తావా లేదంటే కరోనా అంటించ మంటావా’’అని బెదిరింపులకు దిగింది. దీంతో బెదిరిపోయిన సంజీవరెడ్డి ఇంటిలోపలే ఉండిపోయాడు. అయితే అతను బయటకు రాకుండా తలుపులకు తాళం వేసి భారతి నిర్బంధించింది. మూడు రోజులపాటు నిర్బంధంలోనే ఉన్న అతడు బుధవారం ఫోన్‌ ద్వారా జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చి సంజీవరెడ్డిని విడిపించారు. నిందితురాలు భారతిపై ఐపీసీ సెక్షన్‌ 446, 341, 506తో పాటు సెక్షన్‌ 3(1)ఆఫ్‌ ఎపిడమిక్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని ఒకరు...ఫోన్‌ నాకే కావాలంటు మరొకరు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు