Loan Apps: లోన్‌యాప్‌ వేధింపులకు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య!

28 Jul, 2022 10:46 IST|Sakshi

బెంగళూరు: ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌ల వలలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే.. కొందరు అన్నీ తెలిసి కూడా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. అయితే.. నలుగురికి చెప్పాల్సిన ఓ బ్యాంకు ఉద్యోగి లోన్‌యాప్‌ ఉచ్చులో పడి చనిపోవటం గమనార్హం. కేవలం రూ.40వేలు లోన్‌యాప్‌ల ద్వారా తీసుకుని, వారి వేధింపులు తట్టుకోలేక ట్రైన్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కెంగరీ జిల్లాలోని దొడ్డగొల్లారహట్టి గ్రామానికి చెందిన టీ నంద కుమార్‌(52) అనే వ్యక్తి కోఆపరేటివ్‌ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బెంగళూరులోని నయాందహల్లి సమీపంలో సోమవారం రైలు కింద పడి చనిపోయారు. లోన్‌యాప్‌తో పాటు తనకు డబ్బులు ఇచ్చిన స్థానికుల వేధింపులు తట్టుకోలేకే జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయారు నంద. తనకు మెయిల్‌ ద్వారా లోన్‌యాప్‌ ప్రతినిధులు అసభ్యకర సందేశాలు పంపారని, అలాంటి వాటిని నిషేధించాలని సూసైడ్‌ నోట్‌లో కోరినట్లు బెంగళూరు నగర రైల్వే పోలీసులు తెలిపారు. 

ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక మొదట లోన్‌యాప్‌ ద్వారా రూ.3వేలు అప్పు తీసుకున్నారు నంద. ఈ క్రమంలో లోన్‌యాప్‌ ఉచ్చులో పడిపోయారు. పాత లోన్‌  తీర్చేందుకు మరో యాప్‌ ద్వారా రుణం తీసుకున్నారు. వివిధ యాప్‌ల ద్వారా మొత్తం రూ.36,704 రుణం తీసుకున్నారు నంద. వాటిని వసూలు చేసుకునేందుకు అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ చేశారు యాప్‌ ప్రతినిధులు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నంద తన వద్ద రూ.3.6 లక్షల అప్పు చేశాడని, కేవలం రూ.1.5 లక్షలు చెల్లించినట్లు ఓ మహిళ అతడిపై కేసు పెట్టింది. మొత్తం రూ.5 లక్షలు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం నంద ఆత్మహత్య చేసుకున్న క్రమంలో 46 లోన్‌యాప్‌లు సహా మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య

  

మరిన్ని వార్తలు