యువతి మాయలో బ్యాంక్‌ మేనేజర్‌.. రూ. 5.70 కోట్లు బదిలీ!

25 Jun, 2022 09:27 IST|Sakshi

బనశంకరి: డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఓ యువతి మాయలో పడిన బ్యాంక్‌ మేనేజర్‌ తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు ఆమె ఖాతాకు బదిలీ చేసి కటకటాల పాలైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హనుమంతనగర ఇండియన్‌ బ్యాంకులో అనిత అనే మహిళ రూ.1.32 కోట్లు డిపాజిట్‌ చేసింది. డిపాజిట్‌ ఆధారంగా ఆమె రూ.75 లక్షల రుణం తీసుకుంది.

అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌ హరిశంకర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ కౌసల్య, క్లర్క్‌ మునిరాజు పథకం ప్రకారం అనిత డిపాజిట్‌ ఖాతా లీన్‌మార్క్‌ను అనధికారికంగా ఉంచి.. ఆమె డిపాజిట్‌ ఆధారంగా మే 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఓవర్‌డ్రాప్ట్‌ ఖాతాలు తెరిచారు. అందులోకి రూ.5.82 కోట్లు జమ చేశారు. 

ఈ డబ్బును పశ్చిమ బెంగాల్‌లోని 28 బ్యాంక్‌ అకౌంట్లకు, రాష్ట్రంలోని రెండు బ్యాంకు అకౌంట్లకు 6 రోజుల వ్యవధిలోనే 136 సార్లు జమ చేశారు. ఈ విషయం బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లడంతో అంతర్గత విచారణ జరిపారు. ఖాతాదారు పేరుతో రుణం తీసుకున్నట్లు తెలిసి బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ డీఎస్‌ మూర్తి హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళకు చెందిన హరిశంకర్‌ భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టిన హరిశంకర్‌ డేటింగ్‌ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.

యువతి మాయమాటల్లో పడి ఆమె ఖాతాకు తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు జమ చేసినట్లు హరిశంకర్‌ పోలీసుల ముందు అంగీకరించాడు. కాగా, బ్యాంకు మేనేజర్‌ గుర్తుతెలియని యువతికి ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేయడంపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతితో జరిగిన సంభాషణ, ఇతర వ్యవహారాలపై నిర్ధారణ కోసం నిపుణుల సాయం తీసుకుంటున్నారు. పోలీసులు హరిశంకర్‌ను కోర్టులో హాజరు పరిచిన అనంతరం 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు