‘మెప్మా’.. కేసు కదలదేమి చెప్మా!

19 Nov, 2021 04:33 IST|Sakshi

పలు జిల్లాల్లో బోగస్‌ పొదుపు సంఘాలకు రుణాలు 

రికవరీ లేదు... కేసుల్లేవు 

కమ్యూనిటీ ఆర్గనైజర్లు, బ్యాంకు అధికారుల కుమ్మక్కు 

ఒక్కో జిల్లాలో రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా 

ప్రజాప్రతినిధుల అండతో కేసుల నుంచి విముక్తి 

సాక్షి, హైదరాబాద్‌: అది కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌.. నలుగురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఓ టీఎంసీ, మరికొందరు రిసోర్సు పర్సన్లు... బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 64 నకిలీ మహిళా సంఘాలను సృష్టించారు. రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా పెట్టారు. దీనిపై మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు విచారణ జరిపి రూ.3.20 కోట్ల రుణ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. ఒక టీఎంసీని, సీవోను సస్పెండ్‌ చేసి, మరో ముగ్గురు సీవోలకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. బ్యాంకుల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేశారు.

ఆ తర్వాత యథావిధిగా స్థానిక కార్పొరేటర్లు, పెద్ద నాయకులు రంగ ప్రవేశం చేయగా... ఓ సీవోను అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలు లేవు. ఏడాది దాటినా రికవరీ లేదు. కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. ఈ బోగస్‌ రుణాల కుంభకోణం ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్‌తోనే ఆగలేదు. వరంగల్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్‌ కార్పొరేషన్లతోపాటు నల్లగొండ, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట తదితర మునిసిపాలిటీల్లోనూ సాగింది. అన్నిచోట్లా భారీస్థాయిలో రుణ కుంభకోణం సాగినట్లు తెలుస్తోంది. 

సంఘానికి రూ.7.50 లక్షల వరకు రుణం 
నకిలీ మహిళా సంఘాల పేరిట దందాలు 2015లో మొదలైనా 2018, 2019లలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తతంగం సాగింది. కరీంనగర్‌లో 64 సంఘాల ద్వారా 3.20 కోట్లు రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో సీడీఎంఏ డాక్టర్‌ సత్యనారాయణ రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరు, రికవరీలపై దృష్టి పెట్టగా.. చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తేలింది.

రిసోర్స్‌ పర్సన్ల ద్వారా ఒక బోగస్‌ సంఘాన్ని ఏర్పాటు చేయించి, బ్యాంకు అధికారులతో కలిసి మహిళల ఫొటోలు, పేర్లతోపాటు ఆధార్‌ నుంచి బ్యాంకు అకౌంట్‌ వరకు నకిలీవి సృష్టించి ఒక్కో సంఘం పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు రుణాలు పొందినట్లు తేలింది. కరీంనగర్‌లో మూడు సంఘాల నుంచి మాత్రమే రికవరీ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేయడంతో బోగస్‌ రుణాల కేసులు దాదాపుగా క్లోజయ్యాయి.

ఇక్కడ ఏకంగా సీవోలను సస్పెండ్‌ చేసి కొత్త వారిని నియమించారు. సస్పెండ్‌ అయిన వాళ్లు రికవరీ చేసే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఆర్‌పీలపై చర్యలకు ఉపక్రమించినప్పటికీ ప్రజాప్రతినిధుల సిఫారసుతో యథావిధిగా కొనసాగుతున్నారు. మంచిర్యాలలో ముగ్గురు సీవోలను జిల్లాలోని వేర్వేరు మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో 43 సంఘాల ద్వారా రూ.80 లక్షల రుణాలను తీసుకొని పత్తాలేకుండా పోయారు.

సిద్ధిపేటలో రూ.18 లక్షల అక్రమ రుణాలు మంజూరయ్యాయి. ఖమ్మంలో జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మహిళ ఏకంగా ఏసీబీకే చిక్కారు. ప్రతి ఆర్‌పీ నుంచి ఆమె నెలకు రూ.1,500 మేర లంచంగా తీసుకుంటారు. రామగుండంలో మెప్మా అధికారిగా ఉన్న మహిళ ఏడెనిమిదేళ్ల క్రితమే సస్పెండ్‌ అయి ఏడాదిన్నర తరువాత రాజకీయ పరపతితో తిరిగి మంచి పోస్టును దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. 

ఎవరిపైనా చర్యల్లేవ్‌... 
రాష్ట్రంలో మెప్మా పరిధిలో 5,765 మహిళా సమాఖ్యలున్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 20–30 మహిళా సంఘాలు ఉంటాయి. ప్రతి సమాఖ్యకు ఒక రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ) బాధ్యురాలిగా ఉండి ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించి, రికవరీ చేయించాలి. ప్రతి సమాఖ్యలోకి కొత్తగా సంఘాలను తీసుకునే అవకాశం ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని బోగస్‌ సంఘాలను సృష్టించి, రుణాలు పొందారు.

కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టీఎంసీలు, బ్యాంకు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారు. అయితే విషయం బయటకు పొక్కగానే ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేసి తమను తాము రక్షించుకుంటున్నారు. దందాలో భాగస్వాములైన బ్యాంకు అధికారుల గురించి అడిగేవారే లేరు. బోగస్‌ సంఘాల అంశం వెలుగు చూడటంతో ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి కనపరచడం లేదు.   

మరిన్ని వార్తలు