యూట్యూబ్‌ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే?

3 Apr, 2022 18:25 IST|Sakshi

నరసరావుపేట (గుంటూరు జిల్లా): యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకు దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సి.విజయభాస్కరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..  గుంటూరుకు చెందిన రాజేష్‌కుమార్‌ ఐటీఐ చదివాడు. ఏ పనీ చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో బ్యాంకు చోరీల వీడియోలు చూసి మార్చి 30వ తేదీ అర్ధరాత్రి ఫిరంగిపురంలోని ఎస్‌బీఐ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు. తొలుత బ్యాంకులో అలారం వైర్లు కట్‌ చేసిన రాజేష్‌కుమార్‌ కిటికీ ఊచలు కట్‌ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు.

స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు కట్టర్‌ ద్వారా కట్‌చేసి సేఫ్‌ లాకర్‌ తెరిచేందుకు యత్నించాడు. ఆ లాకర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఫోన్‌కు అనుసంధానమై ఉండడంతో ఆ మొబైల్‌ అలారమ్‌ మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మేనేజర్‌ సిబ్బందిని బ్యాంకు వద్దకు పంపారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  కేసు దర్యాప్తు కోసం పోలీసు శాఖ రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట టుటౌన్‌ ఏఎస్‌ఐ జీవీ సుబ్బారావు, నరసరావుపేట రూరల్‌ ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు, ఫిరంగిపురం, నాదెండ్ల ఏఎస్‌ఐలు కె.శ్రీనివాసరావు, రోసిబాబు, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీధర్, నాదెండ్ల  హోంగార్డు కె.మధుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని గ్రిల్స్‌ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది ఆగస్టులో గుంటూరు గాంధీపార్కుకు ఎదురుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోనూ రాజేష్‌కుమార్‌ రూ.23 లక్షలు చోరీ చేయగా, లాలాపేట పోలీసులు అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చిన రాజేష్‌కుమార్‌ మళ్లీ ఫిరంగిపురం ఎస్‌బీఐలో చోరీకి యత్నించాడు. దర్యాప్తు చేసిన సిబ్బందిని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించి రివార్డుకు సిఫార్సు చేశారని డీఎస్పీ చెప్పారు.   

మరిన్ని వార్తలు