జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటూ యువకుడికి వేధింపులు

6 Sep, 2022 04:37 IST|Sakshi
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న ధనేంద్ర

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతపై బాపట్ల టీడీపీ ఇన్‌చార్జి ఒత్తిడి 

ప్రభుత్వ పనితీరు బాగుందని, పోస్టింగ్‌లు పెట్టనని తెగేసి చెప్పిన నేత 

తనకు ప్రాణహాని ఉందని స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు 

సాక్షి, బాపట్ల: సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి వ్యతిరేకంగా ఓ యువకుడితో పోస్టింగ్‌లు పెట్టించేందుకు బాపట్ల టీడీపీ నేతలు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆ యువకుడు సోమవారం పోలీస్‌ స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌కు ఫిర్యాదు చేశాడు.

బాపట్ల టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ తన అనుచరులను ఇంటికి పంపి వేధిస్తున్నాడని, నరేంద్రవర్మ ద్వారా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదులో వివరాల మేరకు.. ఎంటెక్‌ చదివిన ధనేంద్రను టీడీపీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా నియమించింది. నరేంద్రవర్మ మాత్రం ధనేంద్రను వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్, స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా, అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టాలని ధనేంద్రను నరేంద్రవర్మ నిత్యం వేధించేవాడు.

నవరత్నాల లాంటి పథకాలతో పేదలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టలేనని ధనేంద్ర చెప్పడంతో ఆగ్రహించిన నరేంద్రవర్మ అతని ఉద్యోగం పీకేసి ఇంటికి పంపించాడు. ధనేంద్రను ఇటీవల మరోసారి పిలిపించి ఇప్పటికైనా పోస్టింగ్‌లు పెట్టాలంటూ వేధించాడు. అందుకు ససేమిరా అనడంతో నరేంద్రవర్మ తన అనుచరులను ఇంటికి పంపి నిత్యం వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. నరేంద్రవర్మ నుంచి కాపాడాలని ఫిర్యాదులో  ఎస్పీని వేడుకున్నాడు.  

మరిన్ని వార్తలు