బీరు కొనుగోలు ‘గొడవ’.. బార్‌లో యువకులపై నిర్వాహకుల దాడి 

11 Jan, 2022 06:55 IST|Sakshi

 పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

ఏడుగురి రిమాండ్‌  

మేడిపల్లి: మద్యం సేవించడానికి బార్‌కు వెళ్లిన ఇద్దరు యువకులపై బార్‌ నిర్వాహకులు, సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బోడుప్పల్‌ ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌కు చెందిన దంతూరి సాయి కృష్ణ, సాయిరాం స్నేహితులు. వారిరువురు మద్యం సేవించేందుకు సోమవారం ఉప్పల్‌ డిపో సమీపంలోని దర్బార్‌ బార్‌కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వెయిటర్‌కు వీరిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది.

ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో బార్‌ సిబ్బంది మూకుమ్మడిగా వీరిద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పక్కనే ఆస్పత్రిలో చేర్పించగా సమాచారం అందుకున్న బార్‌ సిబ్బందిలో మరికొందరు అక్కడికి వెళ్లి వారిని మరోసారి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

ఏడుగురిపై కేసు నమోదు..
బార్‌ నిర్వాహకులు, సిబ్బంది ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కటిక కుమార్,  జగన్, అమ్మోజు నవీన్, చెంచు వీరేశ్, సుదగాని నర్సింహ్మ, బర్ల రాజిరెడ్డి, చొక్కాల రాజవర్థన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.   

బార్‌ వద్ద ఆందోళన ... 
సాయి కృష్ణ, సాయిరాంపై దాడిని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు దర్బార్‌ బార్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. బార్‌ అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అక్కడికి వచ్చిన ఇద్దరు బారు నిర్వాహకులపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దం పగిలిపోయింది. సంఘటనా స్థలానికి వచ్చిన మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు