బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..

11 Apr, 2023 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు అర్బన్‌: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి వారం రూ.10 వేలు పట్టుకెళ్లండి. మూడేళ్ల తర్వాత మీరు పెట్టిన రూ.లక్ష పెట్టుబడిని వెనక్కు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన రూ.లక్షకు బాండు ఇదిగో’ అంటూ ఓ బ్యూటీషియన్‌ను మోసం చేసి ఏకంగా రూ.45 లక్షలు కాజేసిన ఉదంతమిది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్‌ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డిపల్లెలోని బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో డబ్బులు డిపాజిట్‌ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ తన బంధువు చెప్పడంతో అనూరాధ అక్కడకు వెళ్లింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. మూడేళ్ల తరువాత పెట్టుబడి రూ.లక్షను సైతం ఇచ్చేస్తామని ఏవోజీ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని ఆశపడ్డ అనూరాధ తనతో పాటు తన సమీప బంధువుల నుంచి అప్పు తీసుకుని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఏవోజీ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా రూ.45 లక్షలు చెల్లించారు.
చదవండి: జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో

మూడు నెలలు దాటడంతో వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనూరాధ బోర్డు తిప్పేసినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కంపెనీలో మరికొందరు కూడా పెద్దఎత్తున నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లకు అసలు విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు