వాట్‌ ఏ స్కెచ్‌: ప్రేమోన్మాది యాసిడ్‌ దాడి.. రెండువారాల తర్వాత సన్యాసి గెటప్‌లో..

13 May, 2022 20:04 IST|Sakshi

బెంగళూరు: ప్రేమ పేరుతో ఓ యువతిని విపరీతంగా వేధించిన వ్యక్తి.. చివరకు ఆమెపై పక్కా ప్లాన్‌తో యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. మరి చేసిన నేరానికి పోలీసులు దొరకబడతారు కదా!. అందుకే.. చిక్కకుండా ఉండేందుకు భలే స్కెచ్‌ వేశాడు. సన్యాసి అవతారం ఎత్తి పొరుగు రాష్ట్రంలో ఓ ఆశ్రమంలో సేదతీరుతుండగా.. వెంటాడి మరీ పట్టేసుకున్నాయి ఖాకీలు. 

ఏప్రిల్‌ 28వ తేదీన బెంగళూరు హెగ్గానహళ్ళి, సంజీవిని నగర్‌కు చెందిన నగేష్‌ అనే వ్యక్తి.. మాగడి రోడ్‌లో తన ఆఫీస్‌ బయట నిల్చున్న బాధితురాలి(25)పై యాసిడ్‌ పోశాడు. బాధితురాలి బంధువుల ఇంట్లోనే నగేష్‌ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ ఏడేళ్ల పరిచయం ఉంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ నగేష్‌ బలవంతం చేయగా.. ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. దాడి అనంతరం అతను పారిపోగా.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు నగేష్‌ కోసం వెతుకుతూనే ఉన్నారు.

పక్కా స్కెచ్‌.. 
నగేష్‌ యాసిడ్‌ దాడి ఏదో క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దాడికి ముందు రోజు తన దగ్గరి బంధువులతో ‘నేను రేపు టీవీల్లో కనిపిస్తా’ అంటూ హింట్‌ కూడా ఇచ్చాడట. అంతేకాదు దాడికి ముందే తాను నడిపిస్తున్న బట్టల దుకాణాన్ని, అందులోని ఇతర సామాన్లను అమ్మేశాడు నగేష్‌. ఆ డబ్బుతో పాటే దాడి తర్వాత పారిపోయాడు. అయితే పారిపోయే క్రమంలో అతను చేసిన మరో పని.. సెల్‌ఫోన్‌ను ఉపయోగించకపోవడం. పోలీసులు ట్రేస్‌ చేస్తారనే ఉద్దేశంతో.. తన దగ్గరున్న రెండు ఫోన్లను, సిమ్‌ కార్డులను హోస్కోటే హైవేలో పడేసి వెళ్లిపోయాడు. పైగా ఆ ఫోన్‌లను ఫార్మట్‌ చేసి మరీ పడేశాడు. 

పది టీంలతో వెతుకులాట.. 
నగేష్‌ ఫొటోలను రిలీజ్‌ చేసిన పోలీసులు.. అతని కోసం పది బృందాలతో గాలింపు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోపు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు టీంలను పంపించారు. ఈలోపు తిరువణ్ణమలై దగ్గర ఓ ఆశ్రమంలో నగేష్‌ పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిచూసేసరికి.. తనకిప్పుడు దేని మీద ఆశ లేదని, అన్ని బంధాలను తెంచుకుని ఇక్కడికి వచ్చి సన్యాసిగా బతుకుతున్నానంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. కానీ, పోలీసులు ఊరుకుంటారా? పదహారు రోజుల తర్వాత మొత్తానికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు మొత్తానికి.

చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్‌!!

మరిన్ని వార్తలు