లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? ఇది మీ కోసమే..

27 May, 2021 15:34 IST|Sakshi

లాక్‌డౌన్‌ కాలంలో పెరిగిన మోసాలు

భారీ రాయితీ అంటూ స్వాహా 

బెంగళూరు: లాక్‌డౌన్, కరోనా సమయంలో కోవిడ్‌తో ఇళ్లలో నుంచి బయటికి రాలేక ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా, అలాగైతే నకిలీ అకౌంట్ల పట్ల జాగ్రత్త వహించండి. కరోనాను పెట్టుబడి చేసుకున్న సైబర్‌ వంచకులు నకిలీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లను సృష్టించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు.  


తక్కువ ధర అని బురిడీ.. 
►  బెంగళూరులో ఇన్‌స్టాగ్రాంలో ఓ మహిళకు మొబైల్‌–డీల్‌.సేల్‌ అనే పేజీ కనబడింది. ప్రముఖ కంపెనీల మొబైల్‌ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటన చూసి అక్కడఉన్న నంబర్‌కు కాల్‌చేసి వన్‌ప్లస్‌ మొబైల్‌ బుక్‌చేసింది. ఇందుకు రూ.14 వేలు చెల్లించింది. రెండురోజులైనా అతీగతీ లేదు. ఆ వెబ్‌సైట్‌ పేజీ, ఫోన్‌నంబర్‌ మాయమయ్యాయి.  
►  బిడదిలో ఇన్‌స్టాగ్రాం చూస్తున్న యువతి అక్కడ షాప్‌డ్రాప్స్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ లింక్‌ చూసి అందులో రూ.4,500 విలువచేసే గృహోపకరణాలను రాయితీ ధరలో రూ.842 కే వస్తాయని తెలిసి ఆర్డర్‌ చేసింది. పదిరోజులైనా స్పందన లేదు. మోసపోయింది తక్కువ మొత్తమే కదా అని ఆమె ఫిర్యాదు చేయలేదు.  


వెబ్‌సైట్లతో మోసమే..  
కొందరు డబ్బు తీసుకుని వంచనకు పాల్పడే తాత్కాలిక వెబ్‌సైట్లు రూపొందిస్తున్నారు. అక్కడ నగదు పోగొట్టుకోవడంతో పాటు వస్తువులు చేతికి అందవు. మరికొన్ని వెబ్‌సైట్లలో 70 శాతం రాయితీ పేరుతో బ్రాండెడ్‌ వస్తువులను చూపించి నాసిరకం సామగ్రి పంపిస్తారు. అటువంటి వెబ్‌సైట్ల వలలో పడకపోవడమే మంచిదని పోలీసులు తెలిపారు. వీటిలో జరిగే లావాదేవీలకు ఎలాంటి భరోసా ఉండదు. డబ్బులు పడగానే వెబ్‌సైట్‌ను డిలిట్‌ చేసి మరోపేరుతో ఓపెన్‌ చేసుకుంటారు.  


ఇప్పుడు డిజిటల్‌ నేరాలే అధికం..  
కరోనా లాక్‌డౌన్‌లో హత్యలు, కిడ్నాప్, స్నాచింగ్‌లు వంటి నేరకార్యకలాపాలు తగ్గుముఖం పట్టగా డిజిటల్‌ క్రైమ్స్‌ పెరిగాయి. మామూలు రోజులతో పోలిస్తే 41 శాతం సైబర్‌ నేరాలు పెరిగాయని క్రెడిట్‌ బ్యూరో ట్రాన్స్‌ యూనియన్, ట్రస్ట్‌చెకర్‌ అనే సంస్థల అధ్యయనంలో తెలిపారు. దేశంలో 41 శాతం నేరాలు ఈశాన్యరాష్ట్రాల నుంచి జరుగుతున్నట్లు నివేదికలో వెలుగుచూసింది. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై పారిశ్రామిక ప్రాంతాల్లో డిజిటల్‌ నేరాలు అధికం. కేవైసీ అప్‌డేట్, క్యాష్‌బ్యాక్‌ ప్రలోభాలు, డిజిటల్‌ వాలెట్, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్, లాటరీ, నగదు బదిలీ, సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా నేరగాళ్లు ఎక్కువగా వల విసురుతున్నట్లు తేలింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రముఖ సంస్థల యాప్‌లను ఉపయోగించడం ఉత్తమం. పేరు తెలియని వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు.  

చదవండి: రాసలీలల సీడీ కేసు: అవును.. ఆమె తెలుసు..!

మరిన్ని వార్తలు