మరణంలోనూ వీడని స్నేహబంధం

29 Jul, 2020 11:40 IST|Sakshi
గంగాధర్, తరుణ్‌ (ఫైల్‌)

ట్రాక్టర్‌ ట్రాలీకి ఢీకొని ఇద్దరు యువకుల మృతి

కడెం మండలం మాసాయిపేట్‌లో విషాదం

కడెం(ఖానాపూర్‌): వారిద్దరూ ప్రాణ స్నేహితులు. అతిగా మద్యం సేవించి, మితిమీరిన వేగంతో ప్రయాణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కడెం మండలంలో చోటు చేసుకుంది. మాసాయిపేట్‌ గ్రామానికి చెందిన పంజాల తరుణ్, దుర్గం గంగాధర్‌ అనే యువకులు సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట్‌ గ్రామానికి చెందిన లక్ష్మి–లక్ష్మీనర్సయ్య దంపతులకు ఇద్దరు సంతానం. అలాగే లక్ష్మి–లింగన్న దంపతులకు ముగ్గురు సంతానం. లింగన్న అనారోగ్యంతో మృతి చెందగా, కూతురు అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. పెద్ద కొడుకు ఉపాధి నిమిత్తం ముంబాయిలో ఉంటున్నాడు. చిన్న కొడుకు గంగాధర్‌ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తరుణ్‌ నిర్మల్‌లోని జీఎస్‌ఆర్‌ కళాశాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేయగా, గంగాధర్‌ ఖానాపూర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. వీరిద్దరివి నిరుపేద కుటుంబాలు.

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్న వీరు గ్రామంలో చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా మెలుగుతున్నారు. సోమవారం గ్రామంలో కూలీ పనికి వెళ్లిన వీరిద్దరూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి బైక్‌పై నచ్చన్‌ఎల్లాపూర్‌ నుంచి మాసాయిపేట్‌ వస్తూ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీకి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 11 తర్వాత ప్రమాదం జరగడంతో అర్ధరాత్రి స్థానికులు గమనించిగా ఇద్దరు యువకులు మృతిచెంది రక్తపు మడుగులో పడి ఉన్నారు. మద్యం మత్తు, అతి వేగంతో ఢీకొట్టడంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయి, ఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందరితో కలివిడిగా ఉండే యువకులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని మంగళవారం ఖానాపూర్‌ సీఐ జయరాం, ఇన్‌చార్జి ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా