అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి

16 Dec, 2022 10:01 IST|Sakshi

నగరవాసులకు సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులు

రుణాలు ఎగ్గొడితే వదలమంటూ హెచ్చరికలు

నోయిడాలోని తమ కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి 

స్నేహితులు, బంధువులకు లోన్‌ఫ్రాడర్‌ అంటూ ప్రచారం

సిటీ సైబర్‌క్రైం ఏసీపీకి బాధితురాలి ఫిర్యాదు

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌: అమెరికాలో ఉంటున్న నగర వాసులను టార్గెట్‌ చేస్తూ వారి నుంచి రూ.లక్షలు కాజేసేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వాట్సాప్‌ గ్రూపుల్లో చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానికి ఢిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు. దీంతో ఈ నేరగాళ్లు నగరానికి చెందిన కొందరు యువతులతో వారికి వాట్సాప్‌ కాల్స్‌ చేయిస్తూ రుణాలు ఎగ్గొట్టారని కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లేని పక్షంలో లోన్‌ ఫ్రాడర్‌ అంటూ ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

వాట్సాప్‌ గ్రూపుల్లోకి చొరబడి... 
నగరం నలుమూలల నుంచి అమెరికాలోని పలు ప్రాంతాలకు వెళ్లి విద్య, ఉద్యోగం చేస్తున్న తెలుగు వారు వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తుంటారు. తెలిసిన వారి ద్వారా ఆయా గ్రూపుల్లో యాడ్‌ అవుతున్న కొందరు వ్యక్తులు గ్రూపులోని యువతుల ఫోన్‌ నంబర్‌లను సేకరిస్తున్నారు. ట్రూకాలర్‌ ద్వారా వారి పేరును గుర్తించి దాని ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఐడీలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వారి ఫొటోలు, వారి ప్రొఫైల్స్‌లో ఉన్న మరికొందరి ఫొటోలు, పేర్లను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఢిల్లీకి చెందిన సైబర్‌ నేరగాళ్లకు అందజేస్తున్నారు. 

ఆఫీసుకు రావాలంటూ ఒత్తిడి 
ఈ సమాచారం ఆధారంగా ఢిల్లీ, నోయిడాలో ఉంటున్న సైబర్‌ నేరగాళ్లు అమ్మాయిలకు వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లు చెబుతూ, లీగల్, రికవరీ టీం సభ్యులుగా పరిచయం చేసుకుంటున్నారు. తమ బ్యాంకులో రుణం తీసుకుని దాన్ని కట్టకుండా పారిపోయారని, ఒక్క రోజులో రుణాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మీకు రూ. లక్ష పెద్ద మొత్తం కాదని, ఇవ్వకపోతే మీ ఫొటోతో సహా లోన్‌ఫ్రాడర్‌ అంటూ మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్‌ ద్వారా పంపడమే కాకుండా, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ పేజీల్లో పోస్ట్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే క్రమంలో స్నేహితులకు ఫోన్‌ చేసి రాధ (పేరుమార్చాం) రుణం తీసుకుంది, రెఫరెన్స్‌ కింద మీ పేరు ఇచ్చారు. ఆమె కడుతుందా..లేక మీరు చెల్లిస్తారా అంటూ వే«ధిస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొందరు రూ. లక్షే కదా అంటూ నేరగాళ్లకు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు.  

యువతి ఫిర్యాదుతో వెలుగులోకి..
అమీర్‌పేటకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇటీవల ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి రుణం కట్టాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆమె ఈ తతంగాన్ని మాకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. యూఎస్‌లో నివాసం ఉంటున్న మీ పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇటువంటి ఫోన్‌ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 
– కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ

మరిన్ని వార్తలు