ఈ టాటా గ్రూప్ లింకుపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు

5 Oct, 2021 17:18 IST|Sakshi

గత కొద్ది రోజుల నుంచి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఆ పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి అని ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆన్ లైన్ స్కామ్ లు చాలా సాధారణం అయ్యాయి. అందుకే, ఇటువంటి విషయాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేల మీరు గనుక ఇటువంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ ఆర్థిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. హ్యాకర్లు నిరంతరం మీ డబ్బును దోచుకోవడానికి ఇలాంటి స్కామ్ లింక్స్ పంపిస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి. 

ఒకవేళ మీరు గనుక టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, మిమ్మల్ని సరళమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత చివర్లో బహుమతిని తెరవమని అడుగుతారు. మీరు మూడుసార్లు ప్రయత్నించడానికి ఛాన్స్ ఇస్తారు. ప్రజలు సాధారణంగా ఈ ఉచ్చులో పడతారు. బహుమతుల కోసం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే, మీ వ్యక్తిగత వివరాలను పొందే సామర్ధ్యం ఉన్న వైరస్ లింక్ మీ పరికరంలో హ్యాకర్లు ఇన్ స్టాల్ చేస్తారు. అందుకే ఇటువంటి లింక్స్, పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!)

అదేవిధంగా, మీరు ఆన్‌లైన్‌లో మీ సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయవద్దు అని పేర్కొంటున్నారు. ఈ టాటా గ్రూప్ నకిలీ లింక్ విషయంలో ఆ సంస్థ స్పందించింది. టాటా గ్రూప్, మా సంస్థలకు ఈ నకిలీ ప్రచార లింకుకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీనికి బాధ్యులం కాదు. ఈ లింకు మీద అసలు క్లిక్ చేయకండి, ఎవరికి ఫార్వార్డ్ చేయకండి అని ట్విటర్ ద్వారా తెలిపింది.  
 

మరిన్ని వార్తలు