శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు

20 Mar, 2021 09:00 IST|Sakshi
గోదావరిలో మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం

విషాదం: గోదారమ్మా..ఏందమ్మా ఇది!

సాక్షి, భద్రాచలం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా గడిపిన వారిలో ముగ్గురు మృత్యువాత పడడంతో పెను విషాదం నెలకొంది. గోదావరి తీరం రోదనలతో మిన్నంటింది. స్నానానికి వచ్చిన వారిని నీలో కలుపుంటావా గోదారమ్మా..ఏందమ్మా ఇది! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. భద్రాచలం అయ్యప్ప కాలనీకి  చెందిన మచ్చా శ్రీనివాసరావు కూతురు ఓణీల శుభకార్యానికి తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన వెలిదండి శ్రీను 20మందితో బుధవారం వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు.

శుక్రవారం అయ్యప్ప నగర్‌ కరకట్ట వద్ద గోదావరి వద్దకు తొమ్మిది మంది వెళ్లి బట్టలు ఉతికాక, స్నానం చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం భగవాన్‌ దాస్‌ కాలనీకు చెందిన సొంతమూరి రాంచరణ్‌(08) మునిగిపోతుండటంతో అతడిని కాపాడేందుకు శ్రీను భార్య వెలిదండి వరలక్ష్మి(28), మేనకోడలు కొడవలి సురేఖ(14), రాంచరణ్‌ తల్లి సొంతమూరి భవాని, మండపేటకే చెందిన బంధువు వెలిదండి వీరవెంకటరమణలు వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయి మునిగిపోయారు.

ఒడ్డున ఉన్న వారి కేకలతో స్థానికులు, గజఈతగాళ్లు నీటిలోకి దిగి సురేఖ, భవాని, వీరవెంకట రమణలను రక్షించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ సురేఖ మృతి చెందింది. అనంతరం వరలక్ష్మి, రాంచరణ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సొంతమూరి భవాని పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి మార్చారు. వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

వెలిదండి శ్రీను గతంలో భద్రాచలంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. కొంతకాలం కిందట కుటుంబంతో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు వలస వెళ్లాడు. శుభకార్యానికి రాగా..ఇలా విషాదం నెలకొందని బోరున ఏడుస్తున్నాడు. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో పంచనామా జరిపి కేసు నమోదు చేశారు.
 
శుక్రవారమని ఆపావు..ఇప్పుడు నువ్వే లేకుండా పోయావు
‘ఇంటికి వెళ్దామంటే శుక్రవారమని ఆపావు.. ఇప్పుడు నువ్వే లేకుండా పోయావా వరలక్ష్మీ..’ అంటూ మృతురాలి భర్త శ్రీను రోదించిన తీరు కలిచివేసింది. మరో మృతురాలు సురేఖకు మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చనిపోతే ఆమెను, తమ్ముడిని మేనమామ, మేనత్తలు శ్రీను, వరలక్ష్మి దంపతులే పెంచుతున్నారు. ఇంకో మృతుడు రాంచరణ్‌కు మూడు నెలల క్రితమే గుండెకు సంబంధించి ఆపరేషన్‌ జరిగిందని, ఇంతలోనే మళ్లీ దేవుడు అన్యాయం చేశాడని సంఘటనా స్థలంలో ఉన్న సోదరి విలపించింది.  

కలెక్టర్‌ విచారం
భద్రాచలం వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సురక్షిత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు