రోడ్డు ప్రమాదం : మృతులంతా భాస్కరరావు బంధువులే

2 Aug, 2020 12:51 IST|Sakshi

సాక్షి,  శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం జలంత్రకోట వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను నిన్న(శనివారం) విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ ప్రమాదంలో చనిపోయిన భాస్కరరావు బంధువులుగా గుర్తించారు. భాస్కరరావు మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు ఖరగ్ పూర్ నుంచి స్కార్పియోలో విశాఖకు బయల్దేరారు. కాగా ఆదివారం తెల్లవారుజామున జలంత్రకోట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్‌)

ఈ ప్రమాదంలో భాస్కరరావు అత్త నాగమణి, ఆమె కోడలు లావణ్య, స్కార్పియో డ్రైవర్ రౌతు ద్వారక మృతి చెందారు. భాస్కరరావు బావమరుదులు రాజశేఖర్, ఢిల్లీశ్వరరావు, నాగమణి పెద్ద కోడలు మైథలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షిప్‌యార్డ్‌ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్‌ ఇంజినీరింగ్‌ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్‌ పద్దతిపై పనిచేస్తున్నాడు. హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో  శనివారం భారీ క్రేన్‌ కూలి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ కుటుంబాలను కకావికలం చేసింది..)

మరిన్ని వార్తలు