Bhoiguda Fire Accident: బోయిగూడ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం.. ఫైర్‌ అధికారులేమన్నారంటే

23 Mar, 2022 09:25 IST|Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: బోయిగూడలోని తుక్కు (స్క్రాప్‌) గోడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల దాటికి గోడౌన్‌ పైకప్పు కూలింది. ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మూడు గంటలు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌  కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.


సర్కిల్‌లో గోడౌన్‌ యజమాని సంపత్‌

కాగా శ్రవణ్ ట్రేడర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు రిజినల్ ఫైర్ అధికారి పాపయ్య తెలిపారు. మొదట గోడౌన్‌  గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం మొదలైందని తెలిపారు. ఉదయం 3.10 నిమిషాలకు ప్రమాదం జరిగిందన్నారు. స్క్రాప్‌ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇప్పటి వరకుపదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారని, పొగ మంట వల్ల పదకొండు మంది చనిపోయారని అన్నారు.
సంబంధిత వార్త: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

అయితే మృతదేహాల వెలికితీత సమయంలో చాలా బాధకరమైన సన్నివేశం కనిపించిందన్నారు. ఒకరి మీద ఒకరు పడిపోయి, పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. అలాగే  11 మంది మృతదేహాల్లో వాచ్‌మెన్‌ ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఓ వ్యక్తి మంటలను గుర్తించి కిటీకి నుంచి బయటకు దూకడంతో ప్రాణాలు రక్షించుకోగలిగాడని తెలిపారు. గోడౌన్‌పైన నివాసం కోసం రెండు గదులు ఉన్నాయని అందులోనే కార్మికులు వంట చేసుకోవడం, పడుకోవడం చేస్తారని తెలిపారు. పైకి వెళ్లడానికి గోడౌన్‌నుంచే మెట్ల మార్గం ఉందని తెలిపారు. అందుకే తప్పించుకోలేకపోయారని వెల్లడించారు.

గోడౌన్‌ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా బీహార్ ఛప్రా జిల్లా వాసులు. కుటుంబాలు అన్ని బిహార్‌లో ఉండగా.. ఇక్కడ బ్యాచిలర్‌గా జీవిస్తుంటారు. గోడౌన్‌లో మొత్తం 16 మంది కార్మికులు ఉండగా.. షిఫ్టుల వారీగా 8 మంది కార్మికులు ఉంటారు. అయితే మంగళవారం రాత్రి ముగ్గురు బంధువులు వచ్చారు. ఇక గోడౌన్‌ యజమాని సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గోడౌన్‌కు అనుమతులు ఉన్నాయా లేవా అన్నా అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు