సారిక కేసు: కోడలి మరణం కేసులో సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట

22 Mar, 2022 17:05 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ  కేసులో కోర్టు రాజయ్యను నిర్దోషిగా ప్రకటించింది.

సారిక సూసైడ్‌ కేసులో.. రాజయ్య కొడుకు అనిల్, రాజయ్య, రాజయ్య భార్య మాధవిపైనా కేసు నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్,  రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై అప్పట్లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది వరంగల్‌ కోర్టు. దీంతో రాజయ్య కుటుంబానికి ఊరట లభించింది.

ఇదిలా ఉండగా.. ఎంపీ రాజయ్య కొడుకు అనిల్‌తో సారిక 2002, ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. పిల్లలు పుట్టాక భర్త అనిల్‌ ప్రవర్తనలో మార్పు వచ్చిందని సారిక ఆరోపణలు దిగింది. మానసికంగా వేధించాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని ఆమె వివరించారు. తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆమె సంచలన ఆరోపణలు సైతం చేశారు. పిల్లల పోషణ కోసం సైతం డబ్బులివ్వడం లేదంటూ ఆమె అప్పట్లో పోరాటానికి దిగారు. 

సారికపై వేధింపుల కేసు పెండింగ్‌లో ఉండగానే.. 2015, నవంబర్‌4న ఆనూహ్యంగా సారికి, ముగ్గురు కొడుకులు అభినవ్, కవలలు అయోన్, శ్రీయోన్ మంటల్లో కాలి మృతి చెందారు. ఈ దుర్ఘటనపై సారిక కుటుంబ సభ్యుల అనుమానం మేరకు.. కేసు నమోదు చేసుకుని రాజయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరకట్న వేధింపులు, అనిల్‌ రెండో భార్య సన వల్లే గొడవలు జరిగాయని ఆరోపించింది సారిక కుటుంబం. అయితే పోలీసులు మాత్రం సారిక బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇన్నేళ్ల విచారణ తర్వాత.. కోర్టు రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై పైకోర్టును సారిక కుటుంబం ఆశ్రయిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు