పచ్చని చెట్టు పొట్టన పెట్టుకుంది

12 Sep, 2022 02:49 IST|Sakshi

ఖానాపూర్‌: జలపాతం చూసేందుకు మిత్రులంతా కలిసి బయల్దేరిన విహార యాత్ర విషాద యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై చెట్టు కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో ఆదివారం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన 12 మంది మిత్రులు ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం కుంటాల జలపాతాన్ని చూసేందుకు టాటా మ్యాజిక్‌ వాహనంలో ఉదయం బయల్దేరారు.

ఖానాపూర్‌ మండలం ఎక్బాల్‌పూర్‌ వద్దకు రాగానే వీరి వాహనంపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌ వంతడుపుల బుచ్చిరాం (49), ఉట్నూర్‌ రవి (35) అక్కడికక్కడే మృతి చెందారు. పందిరి నిఖిల్‌కు తీవ్రంగా, మిగిలిన పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం మధ్యలో చెట్టు పడి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువ జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు