బైక్‌ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు

22 May, 2021 13:02 IST|Sakshi
డ్రైనేజీలో నుంచి బయటకు వస్తున్న దొంగ

పాట్నా: వాహనాలు దొంగతనం చేస్తున్న దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు చిక్కకుండా డ్రైనేజీలోకి దూరాడు. ఈ విషయం తెలియని పోలీసులు తీవ్రంగా గాలించి డ్రైనేజీ వద్ద నిలబడ్డారు. అకస్మాత్తుగా డ్రైనేజీపై అనుమానం కలిగింది. డ్రైనేజీని పరిశీలించి చూడగా దొంగ కనిపించాడు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన పోలీసులు దొంగను పైకి రమ్మన్నారు. అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో పోలీసులు డ్రైనేజీని తవ్వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

అరారియా జిల్లా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ దొంగపై వాహనాల దొంగతనం కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం అతడు పోలీసులకు చిక్కాడు. స్టేషన్‌కు తీసుకెళ్లి అనంతరం కోర్టుకు తరలిస్తుండగా సంకెళ్లు విడిపించుకుని పరారయ్యాడు. దొంగ పరారవడంతో సీడీపీఓ పుష్కర్‌ కుమార్‌ తన పోలీస్‌ బృందంతో గాలించారు. డ్రైనేజీలో దూరాడని గుర్తించారు. 

అతడిని పైకి రావాలని చెప్పగా రాలేదు. పైగా చెత్తాచెదారంతో పాటు మురుగు నీరు అధికంగా ఉండడంతో దొంగ బయటకు రావడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జేసీబీని తీసుకచ్చి తవ్వేశారు. పక్కన ఉన్న బండలు తొలగించి అతడిని పైకి తీసుకొచ్చారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో ప్రధాన డ్రైనేజీ కావడంతో ఇబ్బందులు ఎదురవుతుందనే ఉద్దేశంతో పోలీసులు స్పందించి డ్రైనేజీని తవ్వించేశారు.

చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
చదవండి: Siddartha Murder: సిద్ధార్థది పరువు హత్య?

మరిన్ని వార్తలు