సారా వ్యాపారుల బీభత్సం: కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి

24 Jul, 2021 16:38 IST|Sakshi
పోలీసులపై దాడి చేస్తున్న సారా తయారీదారులు

పాట్నా: సారా తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు ఆ గ్రామంలో దాడులు చేశారు. అయితే పోలీసుల సమాచారం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డగించారు. మూకుమ్మడిగా దాడి చేసి పోలీసులను చితకబాదారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. ప్రాణభయంతో ఆ గ్రామం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. 

మద్యపానం నిషేధించడంతో ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి కొందరు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే జహనాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో సారా స్థావరాలు ఉన్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు రాగానే వారిని అడ్డగించారు. రోడ్లను బంద్‌ చేసి వారిపై ప్రతిదాడికి దిగారు. కర్రలు.. రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. కనిపించిన పోలీస్‌ను చితకబాదారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.

ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్‌ మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాడి చేసిన వారిలో నలుగురైదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారి అశోక్‌ పాండే తెలిపారు. కొన్ని పోలీస్‌ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు