విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి..

10 Apr, 2021 21:48 IST|Sakshi

ఇస్లామాపూర్: బైక్‌ చోరీ కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిని కొట్టి చంపారు స్థానికులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అశ్వనీ కుమార్‌ కిషన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ బైక్‌ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసమని ఆయన బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లాకు వెళ్లారు. నిందితుడు అక్కడి పంజిపరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో గోల్‌ పొఖారా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లగా.. సదరు గ్రామస్థులు దర్యాప్తు కోసం వచ్చిన అశ్వనీకుమార్‌పై రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం పోలీసు వారు అతన్ని రక్షించేందుకు ఇస్లాంపూర్ సదర్ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు ఫిరోజ్ ఆలం, అబుజార్ ఆలం, సాహినూర్ ఖాటూన్‌లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని పూర్ణియా రేంజ్‌ ఐజీ తెలిపారు.  బిహార్‌ పోలీసులు స్పందిస్తూ.. కేసు విచారణ నిమిత్తం బెంగాల్‌ వెళ్లిన అశ్వనీ కుమార్‌ స్థానిక పోలీసుల సహకారం కోరారు. కానీ బెంగాల్‌ పోలీసులు అతడి వెంట బృందాన్ని పంపడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

( చదవండి: ఉదయపు దొంగ అరెస్టు )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు