బాలానగర్‌ వంతెన: సేప్టీ గోడకు గుద్దుకున్న బైక్‌, నిద్రమత్తే కారణమా?

21 Jul, 2021 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతి వేగం ప్రమాదకరం.. హెల్మెట్‌ లేని ప్రయాణం వద్దు అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోరు కొందరు. చివరకు ఏం అవుతుంది.. అంటే ఇదిగో ఇలా ఊహించని విధంగా ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితులు తలెత్తుతాయి. బాలానగర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్‌ మీద బైక్‌పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. లైసెన్స్‌ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్‌ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టాడు. 

ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్‌​ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరిన్ని వార్తలు