బాలిక ఉసురుతీసిన పోకిరీలు

18 Sep, 2023 06:43 IST|Sakshi

అంబేడ్కర్‌నగర్‌(యూపీ): సైకిల్‌పై వెళ్తున్న బాలికను వేధించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు ప్రయత్నించారు. దుపట్టాను లాగేయడంతో ఆమె అదుపుతప్పి సైకిల్‌పై నుంచి పడిపోయింది. ఆ వెనుకే మరో యువకుడు ఆమెను బైక్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన యూపీలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బర్హి అయిదిల్‌పూర్‌కు చెందిన నయన్‌శీ పటేల్‌(17) ఇంటర్‌ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళుతోంది. వేగంగా బైక్‌పై వచ్చిన ఆకతాయిలు ఆమె దుపట్టాను లాగడంతో అదుపుతప్పి కిందపడి పోయింది.

ఆ వెనుకే బైక్‌పై వచ్చిన మరో యువకుడు ఆమె మీదుగా బైక్‌ను పోనిచ్చాడు. తీవ్రగాయాలతో బాలిక చనిపోయింది. ఈ అమానుషానికి సంబంధించిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు సెహబాజ్, అర్బాజ్, ఫైసల్‌ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదివారం  ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు పారిపోయేక్రమంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. సదరు పోకిరీలు తన కూతుర్ని వేధిస్తున్నారంటూ వారం క్రితమే పోలీసులకు తెలిపినట్లు తండ్రి సభజీత్‌ వర్మ తెలపడంతో  స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రితేశ్‌ పాండేను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు