Birbhum Violence: బీర్‌భూమ్‌ హత్యాకాండ.. 21 మందిపై ఎఫ్‌ఐఆర్‌

27 Mar, 2022 06:29 IST|Sakshi

రామ్‌పుర్హత్‌: బీర్‌భూమ్‌ హత్యాకాండపై విచారణకు 30 మంది సభ్యుల సీబీఐ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సజీవదహనాలపై విచారణ ఆరంభించింది. విచారణ అనంతరం ఎఫ్‌ఐఆర్‌లో 21 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. స్థానిక నేత హత్యకు ప్రతీకారంగా సజీవదహన ఘటన జరిగిఉండవచ్చని అంచనా వేసిది. మరో 70– 80 మంది గుంపునకు ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది.

డెడ్‌లైన్‌ లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక అందించాల్సిఉన్నందున సమయం వృథా చేయమని సీబీఐ అధికారులు చెప్పారు. డీఐజీ అఖిలేశ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో వచ్చిన సీబీఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. బోగ్తాయ్‌ గ్రామంలో అధికారులు దాదాపు ఐదుగంటలు గడిపారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. తాము జరిపే విచారణను వీడియో తీయడంతో పాటు తమతో ఒక ఫోరెన్సిక్‌ నిపుణుడిని కూడా సీబీఐ అధికారులు వెంటపెట్టుకుతిరుగుతున్నారు. మరికొందరు అధికారులు పోలీసుస్టేషన్‌లో కేసు డైరీని అధ్యయనం చేశారు.

బోగ్తాయ్‌లో శ్మశాన నిశబ్దం
బోగ్తాయ్‌: సజీవదహనం జరిగిన బెంగాల్‌లోని బోగ్తాయ్‌ గ్రామంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. గ్రామస్తులు చాలామంది ఊరువిడిచి పొరుగు గ్రామాలకు పారిపోయారు. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్‌ హత్య, అనంతర హింసాకాండతో గ్రామస్తులు భీతిల్లిపోతున్నారు. ఈ ఘటనలు కొనసాగవచ్చని భయపడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లాంబిడ్డలతో కలిసి బంధువుల ఊర్లకు పారిపోయారు. గ్రామాన్ని సందర్శించిన జర్నలిస్టులకు తాళం వేసిన గృహాలు స్వాగతమిచ్చాయి. కొందరు వృద్ధ మహిళలు, పెద్దవారు మాత్రమే ఊర్లో కనిపించారు. యువకులంతా భయంతో గ్రామం విడిచిపోయారన్నారు. సీబీఐ విచారణ పూర్తయితే నిజానిజాలు బయటపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు