బిట్‌ కాయిన్స్‌ పేరుతో రూ.60 లక్షలు స్వాహా

26 Jun, 2021 07:13 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగులైన భార్యాభర్తలను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బిట్‌ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో రూ.60 లక్షలు కాజేశారు. బాధితులు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

  • అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్‌ దంపతులు ‘జిప్‌బిట్‌’ యాప్‌ ద్వారా బిట్‌ కాయిన్స్‌ క్రయవిక్రయాలు చేస్తుంటారు.  దీని ద్వారానే పరిచయమైన ఓ వ్యక్తి తన ద్వారా పెట్టబడిపెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తానని ఎర వేశాడు. 
  • ఇద్దరూ కలిసి అతడి ద్వారా రూ.10 లక్షల ఇన్వెస్ట్‌ చేశారు. ప్రపంచ మార్కెట్‌లో బిట్‌ కాయిన్‌ విలువ పెరుగుతున్నప్పటికీ... వీరి కాయిన్స్‌ వివరాలు తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించగా, మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్‌ ఖరీదు చేస్తేనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. 
  • దీంతో వారు అతడు చెప్పిన మొత్తం ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్‌ యాప్‌ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేశారు.  లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్‌ చేయగా,  కచ్చితంగా లాభం వచ్చిందని, ఆన్‌లైన్‌లో కాయిన్‌ వాల్యూ చూసుకోవాలని సూచించాడు. 
  • ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
    చదవండి: దారుణం: తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు
>
మరిన్ని వార్తలు