ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసు సూత్రధారి సునీల్‌: బీజేపీ

7 Nov, 2021 06:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో బీజేపీ సరికొత్త ఆరోపణలకు తెర తీసింది. డ్రగ్స్‌ క్రూయిజ్‌ కేసు వెనుక సూత్రధారి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో సన్నిహిత సంబంధాలున్న, ధూలెకి చెందిన సునీల్‌ పాటిల్‌ అనే వ్యక్తి  అని ఆరోపించింది. మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు మోహిత్‌ భారతీయ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిజం  బయటపడకుండా ఉండడం కోసమే మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే మీద ఆరోపణ చేస్తున్నారని అన్నారు.

ఆర్యన్‌ విడుదల కోసం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ నుంచి డబ్బులు దండుకోవడానికి సునీల్‌ స్కెచ్‌ వేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎన్‌సీబీ సాక్షి అయిన ప్రైవేటు డిటెక్టివ్‌ కిరణ్‌ గోసావితో సునీల్‌కి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. క్రూయిజ్‌ నౌకపై ఎన్‌సీబీ దాడి చేయడానికి ముందు నుంచే గోసావి, శామ్‌ డిసౌజాతో సునీల్‌ పాటిల్‌ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కాగా, ఆర్యన్‌కేసు విచారించడానికి ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం న్యూఢిల్లీ నుంచి శనివారం ముంబైకి చేరుకుంది. ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు