మూగజీవాల మృత్యుఘోష ..

14 Jul, 2021 08:46 IST|Sakshi

సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి.  మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్‌ కవర్లో 22 కేఫ్‌లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్‌ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్‌లను గుర్తించారు.

ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్‌ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ  పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు    ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ      ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని     భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్‌ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.  కేఫ్‌ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

మూగజీవాల మృత్యుఘోష 
అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్‌షెల్టర్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్‌ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్‌షెల్టర్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి    ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్‌షెల్టర్‌ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు