బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా!

23 Apr, 2021 00:39 IST|Sakshi

బాధితుల ఫిర్యాదులను పరిశీలిస్తున్న సీవీసీ, ఆర్థిక శాఖ, సీజీఎస్టీ 

పనిచేసిన ప్రతిచోటా వివాదాలతో సావాసం 

అరెస్టు తప్పించుకునేందుకు దొంగ జబ్బులు 

మోకాలినొప్పికి ఐసీయూలో చికిత్స!

సాక్షి, హైదరాబాద్‌: సీజీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అక్రమాలు బోలెడు. అవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుతోపాటు రూ.5 కోట్ల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసగాంధీని మంగళవారం సీబీఐ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గాంధీ దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విధులు నిర్వహించిన చోటల్లా వివాదాలతో సావాసం చేసేవారన్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతోంది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివిధ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ అరెస్టు చేసే సందర్భంలో కూడా ఆయన తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందంటూ దొంగపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. 

సీవీసీ, ఆర్థికశాఖ, సీజీఎస్టీ వద్ద.. 
పోస్టింగ్‌ల విషయంలో గాంధీకి తెరవెనుక అనేక శక్తులు సాయం చేశాయని విమర్శలున్నాయి, ఈ విషయంపై గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 2019లో శ్రీనివాసగాంధీ బేగంబజార్‌ జీఎస్టీ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కూలింగ్‌ పీరియడ్‌లో ఉన్నారు. వాస్తవానికి కూలింగ్‌ పీరియడ్‌లో ఉన్నవారికి ఎలాంటి కేసులు అప్పగించరు. నిబంధనల ప్రకారం... కూలింగ్‌ పీరియడ్‌లో కనీసం రెండు సంవత్సరాలపాటు పనిచేయాలి. కానీ, ఆయన కూలింగ్‌ పీరియడ్‌లో మూడు నెలలు కూడా పనిచేయలేదని సొంత కార్యాలయం సిబ్బందే అంటున్నారు. కొందరు రాజకీయ నేతలు, సొంత శాఖలోని ఇద్దరు వివాదాస్పద ఉన్నతాధికారులు ఆయన్ను తాత్కాలిక డిప్యుటేషన్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా బషీర్‌బాగ్‌లోని యాంటీ ఈవేషన్‌ వింగ్‌–జీఎస్టీకి బదిలీ చేశారు.

సాధారణ ఉద్యోగులకు ఇలాంటి బదిలీలు దాదాపుగా అసాధ్యం. ఈ వివాదాస్పద బదిలీ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌–ఢిల్లీ, జీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ హైదరాబాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రికి కూడా పంపారని సమాచారం. గాంధీ అక్రమాలకు సహకరించిన చిలుక సుధారాణి, ఇద్దరు జీఎస్టీ ఉన్నతాధికారులపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి నుంచి 2020లో రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసిన కేసు తెరపైకి రానుంది. ఈ కేసులోనూ సీబీఐ అధికారులు చురుగ్గా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు నిర్ధారించారు. మిగిలిన సాంకేతిక, డాక్యుమెంటెడ్‌ ఆధారాలు కూడా సేకరించేపనిలో సీబీఐ నిమగ్నమైంది. 

మోకాలి, కడుపునొప్పి సాకుగా చూపి! 
సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో గాంధీ బంధువునంటూ ఓ వృద్ధుడు ఆయన ఇంటికి వచ్చాడు. లోపల కొన్ని బట్టలు సర్దుకుని బైక్‌పై బయలుదేరడం అక్కడే వున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ వృద్ధుడిని రహస్యంగా ఫాలో అయి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఫోన్‌లో బొల్లినేని శ్రీనివాస్‌తో మరోఫోన్‌తో జరిపిన సందేశాలు లభించాయి. అలా అతని ఆచూకీ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిక్కింది. అక్కడికెళ్లిన తరువాత బొల్లినేని ఐసీయూలో మోకాలి, కడుపునొప్పులతో చికిత్స పొందుతుండటం చూసి సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. అతని సమస్యలు తీవ్రమైనవి కావని, ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. 

ఫోన్‌ ఇంట్లో ఆన్‌చేసి.. పరారీ 
సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు గాంధీ విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారాలు చూసిన సీబీఐ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మంగళవారం సీబీఐ అధికారులు బొల్లినేనిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ తన తెలివితేటలు ప్రదర్శించారని తెలిసింది. తన ఫోన్‌ స్విచ్చాన్‌ చేసి (తన లొకేషన్‌ అక్కడే కనిపించేలా) ఇంటి నుంచి పరారయ్యారు. పట్టు వీడని అధికారులు గాంధీ ఇంటి దగ్గరే మకాం వేశారు. అయితే గాంధీ కుటుంబంలోని మహిళలంతా ఆయనను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ డ్రామా క్రియేట్‌ చేసి తమను దుర్భాషలాడారని సీబీఐ అధికారులు వాపోయారు.   

మరిన్ని వార్తలు