పనామా పేపర్స్‌ కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్యా రాయ్‌

21 Dec, 2021 05:09 IST|Sakshi

ఆరు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్‌’ కేసులో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు  ప్రశ్నించారు. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఫారెన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

దాదాపు ఆరు గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. విదేశాలకు నిధుల మళ్లింపునకు సబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ 2016–17 నుంచి దర్యాప్తు చేస్తోంది. 2004లో ఆర్‌బీఐ సరళీకరించిన విదేశీ పెట్టుబడుల పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌), ఫెమా చట్టాలను ఉల్లంఘించి 2005లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో ఆమె తల్లిదండ్రులతో కలసి అమిక్‌ పార్ట్‌నర్స్‌ సంస్థను నెలకొల్పారని, దీనిపై బచ్చన్‌ కుటుంబం వివరణ ఇవ్వాలని ఈడీ గతంలోనే నోటీసులిచ్చింది.

ఈ విషయంలో ఐశ్వర్యకు సమన్లు జారీచేయగా తనకు మరికొంత సమయం కావాలని ఆమె గతంలో రెండుసార్లు విన్నవించుకున్నారు. సోమవారం ఐశ్వర్యను ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పన్నుల బాదరబందీలేని, పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో అనేక దేశాలకు చెందిన సంపన్నులు, నేతలు, సెలబ్రిటీలు రహస్య పెట్టుబడులు పెట్టారని, తద్వారా సొంత దేశాలకు భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.

పనామాకు చెందిన ఆర్థిక, కార్పోరేట్‌ సేవల సంస్థ మొసాక్‌ ఫోన్సెకా ద్వారా వీరంతా పెట్టిన పెట్టుబడులు, ఎగ్గొట్టిన పన్నుల సమగ్ర వివరాలను వాషింగ్టన్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే).. పనామా పేపర్స్‌ పేరిట విడుదల చేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెల్సిందే. దాదాపు 1.15 కోట్ల డాక్యుమెంట్లతో 2016 ఏడాదిలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో భారతీయులకు చెందిన 426 ఆర్థిక ఉల్లంఘనల కేసులూ బయటపడ్డాయి. వాటిలో ఐశ్వర్య డైరెక్టర్‌గా ఉన్న సంస్థా ఉంది. 2009లో ఐశ్వర్య ఆ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆమె మామ అమితాబ్‌ బచ్చన్‌నూ ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులన్నీ భారతీయ చట్టాలకు లోబడే జరిగాయని ఆయన గతంలో వివరణ ఇచ్చారు.

మీకు గడ్డుకాలం మొదలవుతుంది
రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు జయా బచ్చన్‌ శాపం
సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, బీజేపీ సభ్యులకు మధ్య సోమవారం రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్‌డీపీఎస్‌ (సవరణ) బిల్లుపై జయ మాట్లాడుతూ... 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ అంశాన్ని లేవనెత్తారు. సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కలితా కూడా గతంలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారేనన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత కామెంట్లు చేశారని జయ ఆరోపించారు. ఒకదశలో సహనం కోల్పోయిన ఆమె బీజేపీ ఎంపీలను ఉద్దేశిస్తూ ‘మీకు  త్వరలోనే గడ్డుకాలం మొదలవుతుంది. ఇదే నా శాపం’ అని ఆగ్రహించారు.

కోడలు ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరైన రోజే.. ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ‘సభలో నాపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. నా పైనా, నా కెరీర్‌ పైనా వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టకరం. వారలా మాట్లాడాల్సింది కాదు. మీరు సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి. సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు సార్‌. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని భువనేశ్వర్‌ కలితాను ఉద్దేశించి జయాబచ్చన్‌ అన్నారు. తర్వాత కూడా అధికార, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో రాజ్యసభ వాయిదా పడింది.   

వీటికి మీ సమాధానమేంటి ?
1. 2005లో అమిక్‌ పార్ట్‌నర్స్‌ పేరిట నెలకొల్పిన కంపెనీతో మీకున్న సంబంధాలేంటి?
2. కంపెనీ తొలినాళ్లలో మీరు, మీ తండ్రి కె.రమణ కృష్ణ రాయ్, తల్లి కవిత, సోదరుడు ఆదిత్య తలా 12,500 డాలర్లు మొత్తంగా 50వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడులు పెట్టారు. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎందుకున్నారు?
3. 2005 జూన్‌లో డైరెక్టర్‌ నుంచి షేర్‌హోల్డర్‌గా ఎందుకు మారారు?
4. 2008 నుంచి సంస్థ ఎందుకు క్రియాశీలకంగా లేదు?
5. ఆర్థిక లావాదేవీలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతుల వివరాలు చెప్పండి?
6. మీ సంస్థను మొసాక్‌ ఫోన్సెకాయే రిజిస్టర్‌ చేసిందని మీకు తెలుసా?

మరిన్ని వార్తలు