రియాకు బెయిల్‌

8 Oct, 2020 02:25 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్‌సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది.

రియా ఎన్‌సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్‌ మోడల్స్‌కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్‌పుత్‌ వ్యక్తిగత సహాయకులు దీపేష్‌ సావంత్, సామ్యూల్‌ మిరిండాలకు హైకోర్ట్‌ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్‌ స్మగ్లర్‌ అబ్దెల్‌ బాసిత్‌ పరిహార్‌లకు కోర్టు బెయిల్‌ ఇవ్వలేదు. 

మరిన్ని వార్తలు