రియాకు ఊరట.. షోవిక్‌కు షాక్‌!

7 Oct, 2020 11:52 IST|Sakshi

రియాకు బెయిలు.. షోవిక్‌ సహా మరో ఇద్దరికి నిరాకరణ

ముంబై: బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీష్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్‌ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సహా డ్రగ్‌ డీలర్‌ అబ్దుల్‌ బాసిత్‌, శామ్యూల్‌ మిరాండా, దీపేశ్‌ సావంత్‌లను హైకోర్టు బెయిలు నిరాకరించింది.(చదవండి: సుశాంత్‌ మృతి: ‘వాళ్లంతా ఉరేసుకోవాలి’)

కాగా బాలీవుడ​ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో వెలుగులో వచ్చిన డ్రగ్స్‌‌ వ్యవహారంలో అతడి ప్రేయస రియా చక్రవర్తిని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె, సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో సెప్టెంబరు‌ 9న అదుపులోకి తీసుకుని, బైకుల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ రియా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 20 వరకు పొడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్‌ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. అనేక వాయిదాల అనంతరం హైకోర్టులో బుధవారం ఆమెకు ఊరట లభించింది. సుమారు నెల రోజుల తర్వాత ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది.(చదవండి: రియా రిమాండ్‌ను పొడిగించిన ముంబై కోర్టు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు