ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు 

7 Jan, 2021 05:10 IST|Sakshi
బుధవారం అఖిలప్రియ(మాస్క్‌ ధరించిన)ను జడ్జి ముందు హాజరుపర్చేందుకు  తీసుకెళ్తున్న దృశ్యం. చిత్రంలో అఖిలప్రియ సోదరి

సీఎం కేసీఆర్‌ సమీప బంధువుల కిడ్నాప్‌ కేసులో ఏ1గా నిర్ధారణ 

14 రోజుల రిమాండ్‌.. చంచల్‌గూడ జైలుకు తరలింపు 

పరారీలో అఖిల భర్త మిగిలిన నిందితుల కోసం గాలింపు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీప బంధువుల కిడ్నాప్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట య్యారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావుతోపాటు ఆయన సోదరులను మంగళవారం రాత్రి సినీఫక్కీలో కిడ్నాప్‌ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అఖిలప్రియను ఏ1గా నిర్ధారించిన హైదరాబాద్‌ పోలీసులు.. బుధవారం ఆమెను అరెస్టు చేసి మారేడుపల్లిలోని 11వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆశాలత 14 రోజుల రిమాండ్‌ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. 

భూవివాదమే కారణం.. 
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేటలో 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌నకు కారణమని తెలుస్తోంది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోద రులు సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్‌ చేసి బెదిరించడం ద్వారా ఆ స్థలాన్ని తమ పేరుతో రాయించుకోవాలని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ పథ కం వేశారు. ఈ బాధ్యతల్ని తమ అనుచరుడైన శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. నేరచరిత్ర ఉన్న ఇతడిపై గుంటూరులో రౌడీషీట్‌ ఉన్నట్లు తెలిసింది.

మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగిన గుంటూరు శ్రీను.. సాయి, చంటి, ప్రకాష్‌ సహా 14మంది శ్రీకృష్ణనగర్‌లో ఉన్న భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సమావేశమయ్యారు. అక్కడే తాము వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఇన్నోవా, స్విఫ్ట్‌ డిజైర్, మహేంద్ర వాహనాల నెంబర్‌ ప్లేట్లు మార్చి నకిలీవి తగిలించారు. అధికారుల్లా కనిపించేందుకు అందరూ ఫార్మల్‌ వస్త్రాలు, మెడలో టైలు ధరించారు. ఓ నిందితుడు పోలీసు యూనిఫాం వేసుకుని చేతితో లాఠీ కూడా పట్టున్నాడు. ఇవన్నీ ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇచ్చే దుకాణం నుంచి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డులు, బోగస్‌ సెర్చ్‌ వారెంట్‌లు కూడా తయారు చేసుకున్నారు. 

సోదాల పేరుతో హడావుడి చేసి... 
అంతా సిద్ధమైన తర్వాత మూడు వాహనాల్లో బయలుదేరి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌ ఇంటికి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ప్రవీణ్, సునీల్, నవీన్‌లను హాలులో ఉంచిన నిందితులు.. మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఓ బెడ్‌రూమ్‌లో బంధించారు. దాదాపు 20 నిమిషాలు సోదాల పేరుతో హడావిడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి కళ్లకూ గంతలు కట్టి బయటకు తీసుకొచ్చారు. ముగ్గురినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వారి చేతులు, కాళ్లూ కట్టేశారు. బోయిన్‌పల్లి నుంచి సికింద్రాబాద్, ప్యాట్నీ, మెహదీపట్నం మీదుగా చిలుకూరులో ఉన్న భార్గవ్‌ స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురినీ నిర్బంధించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోవైపు రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పొరుగింట్లో ఉండే సచిత అనే మహిళ ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చారు. ఓ గది నుంచి శబ్దాలు రావడం, బయట నుంచి గడియపెట్టి ఉండటం గమనించిన ఆమె.. తలుపు తీశారు. దీంతో గది బయటకు వచ్చిన కుటుంబీకులు ప్రవీణ్, నవీన్, సునీల్‌ కనిపించకపోయే సరికి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కిడ్నాప్‌ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. 

జల్లెడ పట్టిన ప్రత్యేక బృందాలు... 
ప్రవీణ్‌రావు తదితరులు కిడ్నాప్‌ అయిన విషయాన్ని వారి బంధువు కె.మనీష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 బృందాలను రంగంలోకి దింపారు. మూడు కమిషనరేట్లలో పోలీసులు జల్లెడ పడుతుండటం, ఇరుగుపొరుగు రాష్ట్రాలకూ సమాచారం ఇవ్వడం, మీడియా హడావుడి నేపథ్యంలో నిందితులు పునరాలోచనలో పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద బందీలను వదిలేశారు. బాధితులు ఆ విషయాన్ని నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌కు చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ముగ్గురినీ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం 11.20 గంటలకు బోయిన్‌పల్లి పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బేగంపేటలోని మహిళా ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం 12.40కి అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

గాంధీలో హైడ్రామా.. 
అఖిలప్రియ అరెస్టు అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద స్వల్ప హైడ్రామా చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనం దిగుతూనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతోపాటు కుటుంబసభ్యులు హంగామా చేశారు. అఖిలప్రియకు ఫిట్స్‌ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఆమె గర్భవతి అని కూడా అబద్ధాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు గంటలపాటు అఖిలప్రియకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి కాదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. అనంతరం అఖిలప్రియను మీడియా కంటపడనీయకుండా పోలీసులు అక్కడ నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. 

పోలీసుల అదుపులో సుబ్బారెడ్డి 
ఈ కిడ్నాప్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో నివసించే సుబ్బారెడ్డి.. ఈ కేసులో తన పేరు రావడంతో మీడియాతో మాట్లాడారు. మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌ వద్ద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

కిడ్నాప్‌లతో నాకు సంబంధం లేదు 
ప్రవీణ్‌రావుతో కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయి. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్‌లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను నిందితుడిగా ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. గతంలో భూమా అఖిలప్రియ తదితరులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కొందరికి సుపారీ కూడా ఇచ్చారు. అలాంటివారితో కలిసి ఎలా పనిచేస్తాను?  
– మీడియాతో ఏవీ సుబ్బారెడ్డి 

ఆ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే.. 
హఫీజ్‌పేట్‌: ఈ కిడ్నాప్‌ వ్యవహారానికి కారణమైన భూమి అత్యంత విలువైనదేనని తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం న్యూ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 80లోని 25 ఎకరాల భూమిపై ఏళ్లుగా వివాదం నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి తమదంటే తమదంటూ ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే, అది ప్రభుత్వ భూమేనని ఆధారాలతో నిర్ధారించలేకపోవడంతో 2003లో హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు తదితరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి కిడ్నాప్‌కు దారితీసినట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. సర్కారు మాత్రం అది ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును పున:సమీక్షించాలని గత నెలలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  
(చదవండి: సికింద్రాబాద్‌ కోర్టుకు అఖిలప్రియ!)

మరిన్ని వార్తలు