శుభకార్యానికి వచ్చి.. తిరిగి వెళ్లిపోతుండగా..

7 Aug, 2021 16:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీకాకుళం : జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. ఆ ఇంటి ఆశల దీపాన్ని ఆర్పేసింది. బైక్‌ ట్యాంకర్‌ లారీని ఢీకొన్న ఘటనలో ఏడేళ్ల ఆహిల్‌ అనే బాలుడు దుర్మ రణం పాలవ్వగా, తల్లిదండ్రులు గాయపడ్డారు. గాయపడిన తల్లికి కుమారుడు చనిపోయిన విషయం తెలియకపోవడం ఇంకా విషాదం. వివరాల్లోకి వెళితే.. విజయనగరం పట్టణానికి చెందిన అహ్మద్, భార్య సబీరా, కుమారుడు ఆహిల్‌ బైక్‌పై శుక్రవారం ఉదయం ఆమదాలవలసలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. తిరిగి వెళ్లిపోతుండగా.. కుశాలపురం పంచాయతీ నవభారత్‌ వద్ద చిలకపాలెం వైపు వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను అహ్మద్‌ ఓవర్‌ టేక్‌ చేయబోయాడు. లారీ డ్రైవర్‌ బండి వేగం తగ్గించడంతో ట్యాంకర్‌ వెనుక భాగానికి బైక్‌ హ్యాండిల్‌ తగిలింది.

దీంతో బైక్‌పై ఉన్న వారంతా రోడ్డుపై పడిపోయారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న అహ్మద్‌కు స్వల్ప గాయాలు కాగా, సబీరాకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాలుడు ఆహిల్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా వాహనాలు ఆపి వారికి సాయం చేశారు. బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆ దారిలోనే వెళ్తున్న ఎచ్చెర్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ తన కారులో బాలుడిని, క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడు ఊపిరి వదిలేశాడు. ప్రస్తుతం తల్లి సబీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుమారుడు చనిపోయిన విషయం ఆమెకు ఇంకా తెలీదు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు