అల్లరి చేస్తున్నాడని బాలుడి దారుణ హత్య

5 Sep, 2022 04:39 IST|Sakshi
ఆశ్రిత్‌కుమార్‌ (ఫైల్‌)

మేనత్త, మామలే నిందితులు

వైఎస్సార్‌ జిల్లా కడపలో ఘటన

కడప అర్బన్‌: అల్లరి చేస్తున్నాడని ఓ బాలుడిని మేనత్త, మామలు చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా కడపలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి నానమ్మ ఇందిరమ్మ, తాత జానయ్య, పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు.

పెద్ద కుమారుడు ఆశ్రిత్‌కుమార్‌ (8)ను బాగా చదివించాలని శివకుమార్, భాగ్యలక్ష్మిల అనుమతితో కడప ఓంశాంతి నగర్‌లో ఉంటున్న మేనత్త ఇంద్రజ వద్ద పది రోజుల క్రితం నానమ్మ, తాతయ్యలు వదిలిపెట్టారు. ఇంద్రజ, ఆమె భర్త అంజన్‌కుమార్‌ వై–జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులు. ఆశ్రిత్‌ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు..బాగా అల్లరి చేస్తున్నాడనే నెపంతో చిత్రహింసలు పెట్టేవారు.

ఈ నెల 3న రాత్రి రోజూ మాదిరిగానే మేనత్త,మామలు బాలుడిని బాగా కొట్టారు. బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి రిమ్స్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఇంద్రజ దంపతులు వారి కుమార్తెతో కలిసి పరారయ్యారు.  రిమ్స్‌ మార్చురీలోని బాలుడి మృతదేహాన్ని కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అంజన్‌కుమార్‌ను ఇంద్రజ ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇంద్రజ అమ్మా, నాన్న, అన్నా, వదినకు ఇష్టం లేదు. దీంతో వారి మధ్య రాకపోకలు లేవు. ఇంద్రజ కుమార్తె పుట్టిన రోజును ఇటీవల ఘనంగా నిర్వహించారు. దీంతో వీరి మధ్య మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఈ ఘోరం జరిగింది.

అన్నయ్యా..మమ్మల్ని క్షమించు!
తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్‌ చనిపోయాడని ఇంద్రజ, కువైట్‌లో ఉన్న తన అన్న శివకుమార్‌కు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది. తరువాత సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి భర్త, కుమార్తెతో కలిసి పరారైంది. మెసేజ్‌ చూసిన  శివకుమార్‌ ఇంద్రజకు ఫోన్‌ చేయగా..స్విచ్ఛాఫ్‌ రావడంతో తన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు సమాచారమిచ్చాడు. వారు కడప రిమ్స్‌కు హుటాహుటిన చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తలు