ఇన్‌స్టాలో పరిచయం: బాలిక ‘ప్రేమ చదివింపులు’.. చివరకు..

2 Oct, 2021 11:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్‌ మీడియాలో పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలిపే ఉదంతం ఇది. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడి ప్రేమ మాటలు నమ్మిన బాలిక విడతల వారిగా 36 సవర్ల నగలు, రూ.లక్ష నగదు చెల్లించుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తిరువళ్లూరు జిల్లా విష్ణువాక్కం గ్రామానికి చెందిన బాలిక(16) తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది.

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల కోసం తండ్రి స్మార్ట్‌ ఫొన్‌ కొనిచ్చారు. క్లాసులు ముగిసిన తర్వాత సోషల్‌ మీడియాకు అలవాటు పడింది. ఈ క్రమంలో ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మనవాలనగర్‌కు చెందిన రేవంత్‌ పరిచయమయ్యాడు. మాయ మాటలు చెబుతూ ప్రేమపేరుతో బాలికను బుట్టలో వేసుకున్నాడు. అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదని, చదువు కోసమని వివిధ సందర్భాల్లో బాలిక నుంచి 32 సవర్ల నగలు, రూ. లక్ష నగదు వసూలు చేసి చివరికి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు.

ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాలిక తండ్రి వెంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్‌ కోసం గాలిస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

చదవండి: ఆర్‌ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం 

మరిన్ని వార్తలు