విషాదం నింపిన చేప సరదా.. బాలుడి మృతి, అనుమానాలు?

13 Jul, 2021 10:51 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి (ఉండి): అప్పటివరకూ తల్లి ఒడిలో ఆనందంగా గడిపిన పసివాడు నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడిచాడు. చిన్నపాటి చేపను చూపిస్తూ తండ్రి ఆడిస్తుండగా అది జారి బాలుడి గొంతులో పడటంతో ఊపిరాడక మృత్యుఒడికి చేరాడు. గొరక చేప గొంతులో అడ్డుపడి తొమ్మిది నెలల బాలుడు మృతిచెందిన ఘటన చెరుకువాడలో చోటుచేసుకుంది. సోమవారం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చెరుకువాడకు చెందిన తోలాపు నారాయణ (బాబి), సుధారాణి (ఉష) దంపతులు. వీరికి తొమ్మిది నెలల కుమారుడు నందకిశోర్‌ ఉన్నాడు. ఆదివారం సాయంత్రం వీరి ఇంటి పక్కన ఉంటున్న వ్యక్తి గాలం వేసి చేపలు పట్టుకొచ్చాడు. అతడి నుంచి నారాయణ ఐదు గొరక చేపలు తీసుకున్నాడు.

అదే సమయంలో తల్లి సుధారాణి ఒడిలో ఆడుకుంటున్న బాలుడి వద్దకు ఓ చేపను తీసుకువచ్చాడు. చేపను చూపిస్తూ ఆడిస్తుండగా పొరపాటున అది జారి బాలుడి గొంతులో పడింది. దీంతో బాలుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. చేపను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆకివీడులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బా లుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈ మేరకు సోమవారం ఉదయం బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

భర్తే చంపాడంటూ ఆరోపణ  
తన బిడ్డ మృతికి భర్త నారాయణ కారణమంటూ సుధారాణి ఆరోపించింది. ఉండి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆమె మాట్లాడుతూ తనపై భర్తకు అనుమానం ఉందని, దీంతో పెళ్లయిన రెండేళ్ల లో చాలాసార్లు గొడవపడ్డాడని తెలిపింది. బిడ్డ పుట్టిన తొమ్మిది నెలలకు గాను మెట్టినింటికి తీసుకురాలేదని, ఈనెల 1వ తేదీన చెరుకువాడ తీసుకువచ్చాడని వివరించింది. రెండు రోజులుగా తనను వేధిస్తున్నాడని, ఆదివారం తన కాళ్ల పట్టీలు బలవంతంగా తీసుకువెళ్లి మద్యం తాగి వచ్చాడని బోరుమంది. బిడ్డ నోట్లో చేపను తనే పెట్టాడని, దీంతో తన కుమారుడు చనిపోయాడని కన్నీరుమున్నీరైంది. ఆమె బంధువులు పెదగాడి నాగభూషణశాస్త్రి, చించినాడ మల్లేశ్వరరావు, దుర్గాభవాని కూడా నారాయణపై ఆరోపణలు చేశారు.    

మరిన్ని వార్తలు