స్నానానికి వెళ్లి..  శవమై తేలాడు

30 Sep, 2021 10:08 IST|Sakshi

గెడ్డలో కొట్టుకుపోయిన గిరిజన బాలుడు మృతి

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు   

సాక్షి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ ఓ గిరిజన బాలుడిని బలి తీసుకుంది. సీతంపేట పరిధిలోని బర్నగూడ గ్రామానికి చెందిన ఆరిక సుధీర్‌ కుమార్‌ (8) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి వెళ్లి అందులో మునిగి చనిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మన్యంలోని గెడ్డలన్నీ పొంగిపొర్లుతున్నాయి. బర్నగూడకు సమీపంలో ఉన్న గెడ్డ కూడా పోటు మీద ఉంది.

గ్రామంలోని చిన్నారులు స్నానం కోసం బుధవారం గెడ్డలోకి దిగారు. వారిలో సుధీర్‌ కాస్త లోపలకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకునిపోయాడు. దీంతో చిన్నారులంతా భయపడి ఊరిలోకి వచ్చి విషయం చెప్పారు. గిరిజనులు వెళ్లి వెతకగా అరకిలోమీటరు దూరంలో బాలుడు దొరికాడు. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

బాలుడి తండ్రి శీతంనాయుడు హైదరాబాద్‌ వలస వెళ్లి అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి ఆరిక సంతోషమ్మ కూలి పనులు చేస్తుంటారు. సుధీర్‌ స్థానికంగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చలాకీ ఉండే కుర్రాడు ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చదవండి: ఆరేళ్ల సహజీవనం చేసి.. ఆందోళనకు గురై జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు