బెడిసికొట్టిన కిడ్నాప్‌ డ్రామా 

17 Nov, 2021 06:42 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, వేలూరు(తమిళనాడు): ఆంబూరులో కిడ్నాప్‌ నాటకం ఆడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులోని ముకకొల్లై ప్రాంతానికి చెందిన ఎర్రగడ్డల వ్యాపారి ఆశీన్‌. ఇతను ఆదివారం రాత్రి  ఆంబూరు సమీపంలోని వేంగిలిలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరాడు. ఈ సమయంలో ముగ్గురు యువకులు కారును వెంబడించి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.

అక్కడ నుంచి తప్పించుకున్న ఆశీన్‌ ఆంబూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆశీన్‌కు పిల్లలు లేక పోవడంతో అక్క కుమారుడు అమీద్‌(21)ను పెంచుకుంటున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో అమీద్‌ సెల్‌ నెంబర్‌ నుంచి ఆశీన్‌కు ఫోన్‌ వచ్చింది. అందులో గుర్తుతెలియని వ్యక్తులు అమీద్‌ను కిడ్నాప్‌ చేశామని రూ. 10 లక్షలు ఇస్తే వదిలి పెడుతామని హెచ్చరించారు.

వీటిపై ఆశీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాదనూర్‌ వద్ద ఉన్నట్లు సెల్‌ఫోన్‌ సిగ్నిల్స్‌ ద్వారా గుర్తించి.. అక్కడ కారులో దాగి ఉన్న అమీద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఆంబూరు ఆయిల్లా నగర్‌కు చెందిన మహ్మద్‌ సిద్దిక్, కుపేర వీధికి చెందిన అర్‌హత్‌ అబీ, పూతోటకు చెందిన  పయాస్‌ అహ్మద్‌గా తెలిసింది.

ఈ ముగ్గురు కిడ్నాపర్‌లు అమీద్‌ స్నేహితులుగా తెలిసింది. ప్రణాళిక ప్రకారం మామ అశీన్‌ కిడ్నాప్‌ చేయడానికి వేసిన పథకం విఫలం కావడంతో.. అమీద్‌ తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లు నాటకం ఆడినట్లు తేల్చారు. 

 

మరిన్ని వార్తలు