మైనర్‌ బాలికను ప్రేమపేరుతో లోబర్చుకుని..

18 Aug, 2021 11:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నందిపేట్‌(ఆర్మూర్‌): ప్రేమించానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మండలంలోని డొంకేశ్వర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు బతుకుదెరువు కోసం బయట దేశానికి వెళ్లి వచ్చి ఖాళీగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక బోధన్‌లో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండటంతో ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా ఆ బాలికను ప్రేమించానని యువకుడు వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికకు గత కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో కడుపులో ఏదైనా రక్తపు గడ్డ పెరిగిందనే అనుమానంతో సోమవారం జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షలు జరిపి బాలిక మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ విషయమై బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో విషయాన్ని అంతా వివరించింది. సమాచారం తెలుసుకున్న సఖీ టీం బృందం సభ్యులు స్థానిక పోలిస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.  

నిందితులపై గందరగోళం.. 
బాలికపై అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఘటనలో ఈ ప్రాంతానికి చెందిన పాస్టర్‌పై మొదట ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. కాగా విచారణను చేపట్టిన పోలీసులు డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు