అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ

16 Sep, 2021 11:55 IST|Sakshi

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌): గణేశ్‌ విగ్రహం వద్దనున్న లడ్డూను తీసుకొచ్చి తినిపించడంతోపాటు ఇంటి చుట్టూ చల్లితే అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందనే సెంటిమెంట్‌తో 9వ తరగతి చదువుతున్న బాలుడు మార్కెట్‌ ఏరియాలోని వినాయడి చేతిలోని లడ్డూ ను దొంగిలించి సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

నలుగురు వచ్చి వినాయకుడి చేతిలోని లడ్డూను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. లడ్డూ చోరీ చేసిన వారంతా బాలురు కావడం విశేషం. వీరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలిపెట్టారు. ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటేశ్‌ తెలి పారు. 

మరో లడ్డూ మాయం 
వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలోంచి మంగళవారం రాత్రి 10 కేజీల లడ్డూ మాయమైందని నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వేములవాడలో ఇది రెండో లడ్డూ దొంగతనానికి గురైంది. 

మూఢనమ్మకాలను నమ్మరాదు 
ఏదోఒక సెంటిమెంట్‌ అంటూ మైనర్లు, యువకులు వినాయక మంటపాల్లోని లడ్డూలను దొంగతనంగా తీసుకెళ్లడం సరైందికాదు. ఆరోగ్యం బాగుండాలంటే వైద్యం చేయించాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో మండపాల నిర్వహణలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ప్రతీ మంటపం వద్ద నిర్వాహకులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 
–  సీఐ వెంకటేశ్‌ 

మరిన్ని వార్తలు