తరచూ ఫోన్‌ బిజీ వస్తుండటంతో అనుమానం, ప్రియురాలి హత్య

12 Jul, 2021 12:19 IST|Sakshi
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ సీఐ మంజునాథ్, ఎస్‌ఐలు సురేష్, సునీల్‌కుమార్‌

సాక్షి, కర్నూలు(ఎమ్మిగనూరురూరల్‌): నెల రోజుల క్రితం బంధువుల పెళ్లికి బయలుదేరి అదృశ్యమైన మహిళ కేసు మిస్టరీ వీడింది. అనుమానంతోనే ఆమె ప్రియుడు అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి ఆదివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎమ్మిగనూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ బీఏ. మంజునాథ్‌ హత్య కేసు వివరాలను వివరించారు. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మికి ఆదోని చెందిన నాగరాజుతో 11 ఏళ్ల క్రితంవివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. నాగరాజు 9 ఏళ్ల క్రితం చనిపోవటంతో అప్పటి నుంచి పిల్లలతో లక్ష్మి పుట్టినింట్లో ఉంటోంది. అప్పుడప్పుడు ఆదోనికి వెళ్లివచ్చేది. ఇదే క్రమంలో ఆస్పరి మండలం బి. ఆగ్రహారం గ్రామానికి  చెందిన అంద్రి దేవదాస్‌తో పరిచయం ఏర్పడింది.

ఇతను ములుగుందం సచివాలయంలో లైన్‌మన్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా కొన్ని నెలల నుంచి లక్ష్మిపై దేవదాస్‌ అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమె ఫోన్‌ బిజీ వస్తుండటంతో తనతోనే కాకుండా మరి కొందరితో పరిచయం ఉందని పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో లక్ష్మిని హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ ఏడాది జూన్‌ 7వ తేదీన ఆదోనిలో తన భర్త తరుపు బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆచూకీ లేకపోవటంతో గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.       

                                                  హత్యకు గురైన లక్ష్మి (ఫైల్‌)  
చర్చికి వెళ్దామని తీసుకెళ్లి..  
లక్ష్మిపై అనుమానం పెంచుకున్న అంద్రి దేవదాస్‌ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్‌ మేరీమాత చర్చికి వెళ్లివద్దామని, ఇక నుంచి ఇద్దరం బాగుందామని ఫోన్‌లో నమ్మించాడు. ఆ మాటలు నమ్మి జూన్‌ 7వ తేదీన లక్ష్మి అతనితో బైక్‌పై వెళ్లింది. పథకం ప్రకారం అంద్రి దేవదాస్‌ కసాపురం సమీపంలోని జీఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వ దగ్గర పొలాల్లోకి తీసుకెళ్లాడు. తనను మోసం చేశావంటూ ఆవేశంతో లక్ష్మి గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకున్నారు.

ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్‌ తీసి మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మీ కుటుంబ సభ్యులు లైన్‌మెన్‌పై అనుమానం వ్యక్తం చేయటంతో కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు లైన్‌మెన్‌ అంద్రి దేవదాస్‌ను శనివారం అదుపులో తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్టు ఒప్పుకోవడంతో అరెస్ట్‌ చేశారు. హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ పుర్రె, ఎముకలు కనిపించాయి. నిందితుడి నుంచి బైక్, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. సమావేశంలో గోనెగండ్ల ఎస్‌ఐ సురేష్, రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్, రూరల్‌ ఏఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.      

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు