యువకుల నేర ప్రవృత్తి.. కష్టపడకుండానే సంపాదించాలని.. 

17 Aug, 2021 11:43 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి డీఎస్పీ

సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్‌): కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ఇద్దరు యువకులు నేర ప్రవృత్తిని ఎంచుకున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ.. చివరికి పోలీసులకు చిక్కారు. వివరాలను కామారెడ్డి డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సోమనాధం వెల్లడించారు. ఈనెల 13న ఇద్దరు దుండగులు మండలంలోని తిమ్మక్‌పల్లికి చెందిన షక్కరి రాజేశ్వర్‌ను దారిదోపిడీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో దుండగులు రూ.88వేలను అపహరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులు సీపీ ఫుటేజిలు పరిశీలించి నిందితులు టేక్రియాల్‌ గ్రామానికి చెందిన సతీష్, సుధాకర్‌లుగా గుర్తించారు. సోమవారం టేక్రియాల్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పో లీసులు వారిని పట్టుకుని విచారించారు. ఈజీ మనీ కోసమే దొంగతనాలను ఎంచుకున్నామని నిందితు లు పేర్కొన్నారు.

నిందితుల వద్దనుంచి 2 బైకులు, రెండు సెల్‌ఫోన్‌లు, రూ.61 వేల విలువైన బంగారు ఆభరణం, మీడియా పేరుతో ఉన్న రెండు నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి, దేవునిపల్లి ఎస్సై రవికుమార్, ట్రైనీ ఎస్సై రోహిత్, కానిస్టేబుళ్ళు రామస్వామి, మురళి, విశ్వనాధ్, బాలరాజు, లక్ష్మణ్, నరేష్‌లను డీఎస్పీ అభినందించారు. ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సోమనాధం సూచించారు. 

మరిన్ని వార్తలు