పట్టపగలే రెచ్చిపోతున్న ఆకతాయిలు.. మాయమవుతున్న బైక్‌లు

11 Dec, 2021 12:08 IST|Sakshi

అల్లిపురం: టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నిత్యం వారి ఆగడాలతో అవస్థలు పడతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో వేర్వేరు చోట్ల ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయని పోలీసుల రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఇంటి బయట వాహనాలు పెట్టుకుంటే తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియడం లేదని అల్లిపురంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బంగారుమెట్టలో పట్టపగలే వాహనాల్లో పెట్రోలు దొంగిలిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గత నెల 28న నేరెళ్లకోనేరు, కంఠంవారి వీధి ప్రాంతాల్లో రాత్రి వేళ ఇంటి బయట నిలిపిన వాహనాలను దుండగులు తగులబెట్టారు. దీనిపై టూ టౌన్‌ శాంతి భద్రతల పోలీసులకు ఫిర్యాదు అందటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.

మత్తు పదార్థాలు వినియోగించే వారి పనే.. 
32, 34 వార్డుల్లో గంజాయి, మత్తు ఇంజక్షన్లు వాడే వారు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని, వారే మత్తులో ఇలాంటిì పనులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు.

సీసీ కెమెరాలు అవసరం.. 
టూ టౌన్‌ పరిధిలోని ప్రధాన రహదారుల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ వాటిని ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను స్థానికులు కోరుతున్నారు.

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి 
సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. స్థానిక సంఘాల ప్రతినిధులు దాతలను ఏర్పాటు చేస్తే అందుకు తగిన విధంగా వారికి పోలీసు శాఖ సహకరిస్తుంది. ఇప్పటికే కొబ్బరితోటలో స్వస్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు ఈ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేస్తాం. 
– నరసింహారాజు, ఎస్‌ఐ,టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించండి 
32, 34 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన, కొత్త వారు కనిపించినా వారిని నిలువరించి ప్రశ్నించండి. లేదా పోలీసులకు సమాచారం అందజేయండి. ఇప్పటికే బీట్లు పెంచాం. నిరంతర నిఘా ఏర్పాటు చేసాం. ఎవరి మీదైన అనుమానం వస్తే డయల్‌ 100కి గాని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ 0891–2783672 నంబర్లకు తెలియజేయండి. – కూనిబిల్లి శ్రీను, క్రైం ఎస్‌ఐ, టూటౌన్‌

మరిన్ని వార్తలు