నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే

4 Jun, 2023 16:28 IST|Sakshi

లక్నో: పెళ్లినాడు అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటారని వధూవరులు ప్రమాణం చేస్తుంటారు. ఓ జంట మాత్రం ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. మరణంలో కూడా ఒకరిని మరొకరు విడిచిపెట్టలేదు. కొత్తగా పెళ్లైన ఆ జంట.. నవదంపతులుగా గదిలోకి వెళ్లి.. శవాలుగా బయటకు వచ్చారు. దీంతో వధూవరుల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన  ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న ప్రతాప్ యాదవ్, పుష్పకు ఘనంగా వివాహం జరిగింది. సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత రోజు ఈ కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవదంపతులు ఆ రాత్రి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం ఎంత సేపు గడుస్తున్న ఈ కొత్త దంపతులు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. గదిలోకి వెళ్లి చూడగా.. వారిద్దరూ శవాలుగా కనిపించారు.

కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

చదవండి: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య

మరిన్ని వార్తలు