వైజాగ్‌ సృజన ఉదంతం మరవకముందే మహబూబ్‌నగర్‌లో లక్ష్మి!

13 May, 2022 21:23 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: వైజాగ్‌ మదురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన  లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 

అనంతరం ఆమె ఎంతకీ బాత్‌ రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి

మరిన్ని వార్తలు